Begin typing your search above and press return to search.

‘తెలంగాణ రాజధాని హైదరాబాద్’.. రేవంత్ బడ్జెట్ లో పెద్దపీట!

2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు అనంతరం పదేళ్లు ఏపీతో కలిపి ఉమ్మడి రాజధానిగా కొనసాగింది హైదరాబాద్.

By:  Tupaki Desk   |   25 July 2024 10:02 AM GMT
‘తెలంగాణ రాజధాని హైదరాబాద్’.. రేవంత్ బడ్జెట్ లో పెద్దపీట!
X

2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు అనంతరం పదేళ్లు ఏపీతో కలిపి ఉమ్మడి రాజధానిగా కొనసాగింది హైదరాబాద్. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ కు ఇదొక ప్రత్యేక పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2వ తేదీతో ముగిసింది. అంటే.. ఇక తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని. అటు ఏపీ ప్రభుత్వం కూడా 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అప్పటి సీఎం చంద్రబాబు అమరావతికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం వేరే విషయం. ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ టీడీపీ సారథ్యంలోని కూటమి గెలుపుతో అమరావతి ఏకైక రాజధాని అయింది. చిత్రంగా ఇదే సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై హక్కును కోల్పోయింది.

డిసెంబరులోనే తెలంగాణలో రేవంత్ సర్కారు ఏర్పడినప్పటికీ.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ వీలు కాలేదు. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ పెట్టారు. అప్పటికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంది. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మిగిలింది. అంటే.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిశాక తొలి బడ్జెట్. కాగా.. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో హైదరాబాద్ గురించే అతిపెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని.. నగరాన్ని డెవలప్ చేయడం లో సీమాంధ్రుల పెట్టుబడులూ ఉన్నాయని.. ఇలా అనేకానేక అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అందుకనే అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంచింది.

రేవంత్ సర్కారులో ఏమేం దక్కాయంటే..?

తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ దక్కిన అనంతరం తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏమేం దక్కాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను రేవంత్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తలకెత్తుకుంది. బడ్జెట్ లో ఏకంగా రూ.1525 కోట్లు కేటాయించింది.

నగరానికి నజరానా.. మూసీకి మహర్దశ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి 3,065 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, జలమండలి కి 3385 కోట్లు ఇవ్వనుంది. కాగా.. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకు 200 కోట్లు, ఎయిర్ పోర్ట్ మెట్రోకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ కు 500 కోట్లు, పాత బస్తీ మెట్రోకు 500కోట్లు, ఎంఎంటీఎస్ కు 50 కోట్లు కేటాయించారు. రీజనల్ రింగ్ తర్వాత రేవంత్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యంగా తీసుకున్న ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్. దీనికోసం కేంద్రాన్ని రూ.10 వేల కోట్లు నిధులు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. సొంతంగానే రాష్ట్ర బడ్జెట్ లో రూ.1,500 కోట్లను కేటాయించింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల పైనే ఇచ్చింది. మొత్తం బడ్జెట్ 2.91 లక్షల కోట్లు కాగా.. అందులో హైదరాబాద్ కు దక్కింది 3 శాతం పైనే అనుకోవాలి.