ఎకరా రూ.236 కోట్లు.. ముంబయిలో భారీ ల్యాండ్ డీల్
ఈ మధ్యనే కోకాపేటలో ఎకరం రూ.105 కోట్లు పలికితే అదో పెద్ద హాట్ న్యూస్ గా మారింది.
By: Tupaki Desk | 14 Sep 2023 4:32 AM GMTఈ మధ్యనే కోకాపేటలో ఎకరం రూ.105 కోట్లు పలికితే అదో పెద్ద హాట్ న్యూస్ గా మారింది. నిజానికి వేలంలో ఒక్క ప్లాట్ కు మాత్రమే ఆ ధర పలికి.. మిగిలిన వాటి ధరలు రూ.70 కోట్లు మాత్రమే పలికినా.. రూ.105 కోట్ల మాటే హైలెట్ అయ్యింది. ఆ వేలం పుణ్యమా అని కోకాపేట.. ఆ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ధరలు ఎంత భారీగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో భారీ ల్యాండ్ డీల్ తెర మీదకు వచ్చింది. ఎకరా రూ.236కోట్ల చొప్పున దాదాపు 22 ఎకరాలను అమ్మేసిన వైనం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ఇంతకూ ఇంత భారీ ధర పలికిన ల్యాండ్ ఎక్కడ ఉందంటున్నారా? మీ అంచనా కరెక్టే. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని వర్లీ ప్రాంతంలోని 22 ఎకరాల భూమి రూ.5200కోట్లకు అమ్ముడైంది. ఎకరాకురూ.236.37 కోట్లు చొప్పున వాడియా గ్రూప్ నకు చెందిన బాంబే డైయింగ్ అండ్ మాన్యూఫాక్చరింగ్ కంపెనీనుంచి జపాన్ కు చెందిన రియల్టీ కంపెనీ సుమిటొమో అనుబంధ విభాగమైన గొయిసు రియల్టీ ఈ భూమిని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటివరకు ముంబయిలో జరిగిన అతి ఖరీదైన ల్యాండ్ డీల్ ఇదేనని చెబుతున్నారు. వాడియా గ్రూప్ తన అప్పుల భారాన్ని తగ్గించుకోవటానికి ఈ భూమిని అమ్మేసింది. ఈ గ్రూప్ నకు అప్పు రూ.3969 కోట్లుగా ఉంది. ఈ డీల్ పుణ్యమ అని అప్పులు పోయి.. చేతినిండా లిక్విడ్ క్యాష్ వచ్చేసే పరిస్థితి. ఈ డీల్ కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.