Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు!?

ప్రస్తుతం భారతదేశంలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2024 5:30 PM GMT
ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు.. ఖర్చు  రూ.1.35 లక్షల కోట్లు!?
X

ప్రస్తుతం భారతదేశంలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ఎన్నికల కోసం వివిధ రూపాల్లో ఎన్నో కోట్ల ఖర్చవుతుందనేది తెలిసిన విష్యమే. ఈ సమయంలో ఈ లోక్ సభ ఎన్నికల వేళ జరిగే ఖర్చుపై నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వారు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే... ఈ ఎన్నికలు ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలుగా రికార్డ్ సృష్టించబోతున్నాయని తెలుస్తుంది!

అవును... సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు ఖర్చవుతుందనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో తాజాగా తెరపైకి వస్తున్న నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్‌ సభ ఎన్నికల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు చెబుతున్నారు! అమెరికాకు చెందిన ఓపెన్‌ సీక్రెట్స్‌ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం రూ.1.2 లక్షల కోట్లను తాజాగా భారత లోక్ సభ ఎన్నికలు దాటిపోనున్నాయని చెబుతున్నారు.

ఈ లెక్కన దేశంలో ఉన్న ఓటర్ల సరాసరిన లెక్కలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇందులో భాగంగా.. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది కాగా.. ఈ 1.35 లక్షల రూపాయలలో ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది! ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 2019లో అయిన ఖర్చు రూ.60 వేల కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ కానుండటం!!

వాస్తవానికి ఎన్నికల ఖర్చు రూ.1.2 లక్షల కోట్లు అవుతుందని తొలుత అంచనా వేశాం. అయితే.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం మొదలైన అంశాల ఆధారంగా ఈ ఖర్చును రూ.1.35 లక్షల కోట్లుగా సవరించినట్లు చెబుతున్నారు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి మూడు, నాలుగు నెలల ముందునుంచి చేసిన ఖర్చులూ ఇందులోకి వస్తాయని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... 2019 ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేయగా.. అందులో 45 శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీదే కావడం గమనార్హం. దీంతో... ఈసారి ఎన్నికల్లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల సిద్ధాంతాల కంటే ధనబలం పైనే విశ్వాసం పెరుగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!