Begin typing your search above and press return to search.

ఏపీ పోలింగ్: ఆ 2 గంటల్లో అదరగొట్టేశారు!

హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి ముగింపుగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంకం ముగిసింది.

By:  Tupaki Desk   |   14 May 2024 5:14 AM GMT
ఏపీ పోలింగ్: ఆ 2 గంటల్లో అదరగొట్టేశారు!
X

హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి ముగింపుగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంకం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్ లో ఏపీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు మొదలై పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసినప్పటికీ.. అప్పటికే క్యూలైన్ లో ఉన్న వారంతా ఓటేసే వరకు పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 78.36 శాతం ఓటింగ్ పోల్ అయ్యింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్.. తొలుత కాసేపు మందకొడిగా సాగిందనే చెప్పాలి.

మొదటి 2 గంటల్లో (ఉదయం 7 - 9 గంటలు) కేవలం 9.21 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా.. ఉదయం 11 గంటల నాటికి మాత్రం సీన్ మారింది. ఉదయం 11 గంటల వేళకు 23.04 శాతం (9-11 గంటలు) పోలింగ్ నమోదైంది. ఇక.. మధ్యాహ్నం 1 గంటల సమయానికి ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరటమే కాదు.. దీని ప్రభావం పోలింగ్ మీదా చూపించింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మొత్తం పోలింగ్ 40.26 శాతం (ఉదయం 11 - మధ్యాహ్నం 1 గంట వరకు) నమోదైంది.

మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి (మధ్యాహ్నం 1-3 గంటలు) పోలింగ్ 55.48 శాతానికి చేరుకుంది.సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి 67.99 శాతానికి చేరుకోగా.. ఓట్లు వేయటానికి సమయం పూర్తి అయ్యేనాటికి క్యూలైన్ లో ఉన్న వారంతా ఓట్లు వేయటం పూర్తి అయ్యేసరికి 78.36 శాతం నమోదైంది. కొన్ని పోలింగ్ బూత్ లలో అర్థరాత్రి వరకు పోలింగ్ సాగటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

ఏపీలో జరిగిన పోలింగ్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి చొప్పున విభజిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో జరిగిన పోలింగ్ ఎక్కువ మంది ఓటేయటం కనిపిస్తుంది. అదెలానంటే.. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో 9.21 శాతం అయితే.. ఆ తర్వాతి 2 గంటలకు 13.8 శాతం పోలింగ్ నమోదైంది. అన్నింటికి మించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఏపీ వ్యాప్తంగా భారీగా పోలింగ్ అయ్యింది. సోమవారం నాటి మొత్తం పోలింగ్ లో ఇదే హైలెట్ గా చెప్పే రెండు గంటలుగా చెప్పాలి. ఈ రెండు గంటల వ్యవధిలో 17.22 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య గడిచిన రెండు గంటల ఓటింగ్ సరళిని చూస్తే.. 15.23 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో 12.5 శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసేసరికి పోలింగ్ స్టేషన్లలో ఉన్న ఓటర్లు మొత్తం ఓటేసే వరకు చూసినప్పుడు 10.37 శాతం పోలింగ్ నమోదైంది. అంటే.. ఆరంభంలోని 2 గంటలతో పోలిస్తే.. పోలింగ్ ముగిసిన తర్వాత క్యూలైన్ లో ఉన్న ఓటర్లు ఓటు వేసిన శాతం ఎక్కువగా ఉండటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.