కలిసి రావడం అంటే ఇదే.. ట్రంప్ కి సౌండ్ లేదు!
‘కలిసొచ్చే కాలమొస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంట’.. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇలాగే ఉంది.
By: Tupaki Desk | 16 July 2024 6:35 AM GMT‘కలిసొచ్చే కాలమొస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంట’.. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇలాగే ఉంది. వచ్చే నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై కొద్ది రోజుల క్రితం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ ఘటనతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయావకాశాలు ఏకంగా 78 శాతానికి పెరిగాయి. ఈ మేరకు పలు సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఇదిలా ఉంటే ట్రంప్ కు మరో శుభవార్త కూడా చేరింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రహస్య పత్రాల లీక్ కు సంబంధించి ఆయనపై నమోదైన ఓ కేసును ఫ్లోరిడా కోర్టు రద్దు చేసింది. ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఈ మేరకు తనపై అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరఫు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు అంగీకరించింది.
2021 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తి చేసుకున్నాక ట్రంప్.. ప్రభుత్వానికి చెందిన కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు భారీగా తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే ఈ ఆరోపణలను ట్రంప్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడి నివాస భవనం వైట్ హౌస్ నుంచి ట్రంప్ తన వస్తువులను తీసుకు వెళ్తున్నప్పుడు.. ఏవో పత్రాలు వాటితోపాటు వచ్చి ఉంటాయని ప్రకటించింది. పదవి నుంచి తప్పుకున్నాక హడావుడిగా వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సి రావడంతోనే ఇలా జరిగి ఉంటుందని ట్రంప్ కార్యాలయం తెలిపింది.
ఈ నేపథ్యంలో అప్పట్లో ఆ పత్రాలను వెనక్కి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా ట్రంప్ అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జనవరి 2022లో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఫ్‌బీఐ) అధికారులు ట్రంప్ ఎస్టేటులో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 15 పెట్టెల్లో ఉన్న 184 పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రహస్య, అత్యంత రహస్య పత్రాలు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో 2022 ఆగస్టులోనూ మరోసారి ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్ లో సోదాలు చేశారు. అప్పుడు మరికొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని ట్రంప్ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు కేసునే ఫ్లోరిడా కోర్టు తాజాగా కొట్టేసింది.
ఇటీవలే నేరాభియోగాలపై విచారణల నుంచి అమెరికా మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహస్య పత్రాల Ðð ల్లడి కేసులోనూ ట్రంప్ కు ఊరట లభించడం విశేషం. దీంతో మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట ట్రంప్ కు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయని అంటున్నారు.