Begin typing your search above and press return to search.

ఓటేశారు.. బయలుదేరారు..కిక్కిరిసిన దారులు

ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయటానికి లక్షలాది మంది ఓటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ ఊళ్లకు రావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2024 5:35 AM GMT
ఓటేశారు.. బయలుదేరారు..కిక్కిరిసిన దారులు
X

ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయటానికి లక్షలాది మంది ఓటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ ఊళ్లకు రావటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. ఈసారి ఎన్నికల స్పెషల్ ఏమంటే.. ఓట్లు వేయటం కోసం విదేశాల నుంచి సైతం వందలాది మంది ఊళ్లకు వచ్చారు. గతంలో ఇలాంటి పరిస్థితి చాలాచాలా తక్కువగా ఉండేది. అందుకు భిన్నంగా ఈసారి సమరోత్సాహంతో ఏపీకి వచ్చిన వైనం రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో ఇంత భారీగా ఓట్లు వేయటం కోసం ఊళ్లకు వచ్చిన తీరు.. తుది ఫలితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లు వేయటానికి భారీగా తరలివచ్చిన ఓటర్లలో అత్యధికం హైదరాబాద్ నుంచి వచ్చిన వారే ఎక్కువ. లక్షలాది మంది తమ సొంత వాహనాలు.. ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు బస్సుల్లోనే కాదు.. రైళ్లలోనూ.. ఇతర ప్రయాణ వాహనాల మీదా ఊళ్లకు చేరుకున్నారు. ఓటు వేసే మిషన్ ను సోమవారం మధ్యాహ్నానానికి పూర్తి చేసుకున్న వారు భోజనాలు అయ్యాక తిరిగి హైదరాబాద్ కు చేరుకోవటానికి తిరుగుముఖం పట్టారు.

దీంతో సాయంత్రం ఐదు గంటలు అయ్యేసరికి ఏపీలోని అన్ని మార్గాలు హైదరాబాద్ వెళ్లే రోడ్లలో వాహనాలు బారులు తీరిన పరిస్థితి. ఓటేసేందుకు గురువారం నుంచి ప్రయాణాలు పెట్టుకోగా.. శుక్ర.. శనివారాల్లో భారీగా తరలివెళ్లారు. ఇదెంత ఎక్కువగా ఉందంటే.. సంక్రాంతి పండుగ వేళలోనూ ఇంతలా ఉండరన్న మాట పలువురి నోట వినిపించింది. ఇందుకు తగ్గట్లే హైదరాబాద్ మహానగరంలోని ప్రతి ప్రాంతంలోనూ జనాలే కనిపించని పరిస్థితి. ట్రాఫిక్ అన్నదే లేకుండా పోయింది. రోజువారీగా చూసే రోడ్లు మొత్తం విశాలంగా కనిపించిన పరిస్థితి.

ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ కు వస్తుంటాయి. అందుకు భిన్నంగా సోమవారం మాత్రం సాయంత్రం ఆరున్నర గంటలకే 35 వేలు దాటిందని.. అర్థరాత్రి నాటికి మరో 30వేలకు పైనే ప్రయాణించే వీలుందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఓట్ల కోసం ప్రయాణాలు పెట్టుకున్న వారి సంఖ్య దగ్గర దగ్గర 10 లక్షల మంది వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకుంటే.. కొందరు వారం ముందుగానే ఊళ్లకు వెళ్లిపోయారు. చాలామంది ఓటర్లు తిరిగి వెళుతూ.. తమ మిషన్ పూర్తైందని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇంత భారీగా తరలివచ్చిన ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది తేలాలంటే వచ్చే నెల నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయక తప్పదు.