Begin typing your search above and press return to search.

తాడిపత్రి ఎపిసోడ్ ఏం చెబుతోంది?

అనునిత్యం వారి ఇంట వందలాది మందికి భోజనాలు పెట్టే సంప్రదాయం ఉంది.

By:  Tupaki Desk   |   17 May 2024 7:18 AM GMT
తాడిపత్రి ఎపిసోడ్ ఏం చెబుతోంది?
X

రాజకీయాలు అన్న తర్వాత భేదాభిప్రాయాలు సహజం. అయితే.. ఇవేమీ వ్యక్తిగత స్థాయికి వెళ్లనంత వరకు ఓకే. బ్యాడ్ లక్ ఏమంటే.. గడిచిన కొంతకాలంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులు మొత్తంగా మారిపోతున్నాయి. రాజకీయ విభేదాలు నేతల మధ్యనే కాదు.. సాదాసీదా మనుషుల మధ్య వ్యక్తిగత స్థాయికి వైరం వ్యాపించిన దుస్థితి. ఇందుకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏపీకి సరికొత్త హెచ్చరికను చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికల సందర్భంగా రగిలిన ఎన్నికల వేడి అంతకంతకూ ముదిరిపోయిన నేపథ్యలో ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు.. ప్రతిదాడులతో పాటు.. పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పలు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆందోళన ఇప్పుడు పెరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాయలసీమ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన నేతల్లో జేసీ కుటుంబం ఒకటి. అనంత జిల్లాలో వారికంటూ ఒక ఛరిష్మా ఉంది. తాడిపత్రి కేంద్రంలో వారికి తిరుగులేదన్న మాట దశాబ్దాలుగా వినిపిస్తున్న పరిస్థితి.

అనునిత్యం వారి ఇంట వందలాది మందికి భోజనాలు పెట్టే సంప్రదాయం ఉంది. ఇంటికి వచ్చిన వారు ఎవరైనా సరే భోజనం చేసి వెళ్లాలని చెప్పటం.. అందుకు తగ్గట్లే భోజనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ నెల 14న తాడిపత్రిలో టీడీపీ నేత సూర్యముని ఇంటి మీద దాడి జరగటం.. అనంతరం రెండు వర్గాల మధ్య గొడవ జరగటం తెలిసిందే. ఈ గొడవ రాళ్లదాడి వరకు వెళ్లింది. దీనిపై రెండు వర్గాలకు సంబంధించిన వాదనలు ఉన్నాయి.

వీటిని పక్కన పెడితే.. రాజంపేట డీఎస్పీగా వ్యవహరిస్తున్న చైతన్య.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత పలువురు పోలీసుల్ని తన వెంట తీసుకొని తాడిపత్రికి రావటం.. జేసీ ఇంట్లో పని చేసే వారందరిని తమ అధీనంలోకి తీసుకోవటం.. పలువురి మీద దాడి చేయటం.. ఇదేమిటి? అని అడిగిన వారిని విచక్షణారహితంగా కొట్టటం తెలిసిందే. ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. రాజంపేటలో విధులు నిర్వర్తించే డీఎస్పీకి తాడిపత్రిలో ఏం పని? అన్నది ప్రశ్న. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పని పరిస్థితి. సింఫుల్ గా తమకు తెలీదని మాత్రం చెబుతున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య తీరు వివాదాస్పదంగా మారింది.

ఇదిలా ఉండగా.. జేసీ దివాకర్ రెడ్డి సతీమణి విజయమ్మ.. సోదరి సుజాతమ్మ కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు.వారికి అవసరమైన మందులు.. భోజనాలకు సంబంధించిన బాగోగులు చూసుకునే సహాయకులంతా పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవటంతో.. వారికి భోజనం లేని పరిస్థితి. దీంతో.. దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి గురువారం తాడిపత్రికి వచ్చారు. అయితే.. పోలీసులు వారికి ఆంక్షలు విధిస్తూ.. మీరు తాడిపత్రిలో ఉండకూడదు.. ఉంటే..హౌస్ అరెస్టు చేస్తామని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. ఈ తీరుపై పవన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ఇంకేమీ చేయలేక జేసీ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు వచ్చేసింది.

ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు.. అధికారం ఎవరి చేతిలో ఉంటే.. వారు తమ ప్రత్యర్థులపై ఈ తరహాలో విరుచుకుపడితే రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెలా మారతాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయ వైరం మామూలే. అయితే.. దానికంటూ ఒకస్థాయి వరకే పరిమితం కావాలి. అంతేతప్పించి తిండి కోసం ఊళ్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే.. రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర పరిణామాలకు తెర తీసినట్లు అవుతుంది. ఇలాంటివి ఊరికే కాదు.. రాష్ట్రానికి కూడా మంచిది కాదు. తాడిపత్రి పరిణామం ఏపీ రాజకీయాలకు ఒక వార్నింగ్ లాంటిది. దాన్ని పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మరిన్ని విపరిణామాలకు దారి తీస్తుందన్నది మర్చిపోకూడదు.