Begin typing your search above and press return to search.

మహా కార్చిచ్చు.. ఆ సిటీలో సగాన్ని దహనం చేసేసింది

అగ్నిప్రమాదాలకు వందల రెట్లు ప్రమాదకరంగా ఉంటాయి కార్చిచ్చులు.

By:  Tupaki Desk   |   26 July 2024 9:29 AM GMT
మహా కార్చిచ్చు.. ఆ సిటీలో సగాన్ని దహనం చేసేసింది
X

అగ్నిప్రమాదాలకు వందల రెట్లు ప్రమాదకరంగా ఉంటాయి కార్చిచ్చులు. ఇవి ఒకసారి మొదలైతే వాటిని ఆపతరం అంత తేలిక కాదు. ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావటానికి కొన్నిసార్లు వారాలే కాదు.. నెలలు కూడా పడతాయి. అది కూడా అత్యాధునిక సాధనాలు వాడటం ద్వారా. తాజాగా అలాంటి ఒక భారీ కార్చిచ్చు కెనడాలోని జాస్పర్ నగరాన్ని చుట్టేసింది. బుధవారం సాయంత్రం నగరాన్ని చుట్టేసిన కార్చిచ్చు ప్రస్తుతం వంద మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది.

అది.. ఇది అన్న తేడా లేకుండా ఇళ్లు.. షాపులు.. ఇలా ఇప్పటికి సిటీలో సగభాగాన్ని కాల్చేశాయి ఈ మంటలు. ఈ మంటల తీవ్రత ఎంత తీవ్రంగా ఉందన్న దానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్పేయొచ్చు. ఐదు కిలోమీటర్ల దూరాన్ని దహించివేయటానికి కేవలం అరగంట మాత్రమే టైం తీసుకుంటున్న పరిస్థితి. ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.. అక్కడి అగ్నికీలలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న దానికి అర్థం చేసుకోవటానికి.

ఇప్పటికే వేలాది మంది ఆ నగరం నుంచి వెళ్లిపోయారు. ఈ నగరంలో నివసించే ప్రజలకు అత్యంత కష్టకాలంగా అభివర్ణిస్తున్నారు. దాదాపు 50 శాతం పట్టణం కాలిపోయిందని..దాన్ని పునర్ నిర్మించేందుకు భారీ ఎత్తున చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నగరానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. తాజా కార్చిచ్చు నేపథ్యంలో 20వేల మంది టూరిస్టులు.. 5 వేల మంది స్థానికులు ప్రాణాల్ని కాపాడుకోవటానికి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ నగరంలోని జాస్పర్ నేషనల్ పార్కును ప్రతి ఏడాది పాతిక లక్షల మంది సందర్శిస్తుంటారు. అంత ప్రముఖమైన పార్కు ఉన్న నగరం ఇప్పుడు మంటల్లో తగలబడిపోతోంది.

ఈ కార్చిచ్చు 36 వేల హెక్టార్లలో వ్యాపించే వీలుందని అంచనా వేస్తున్నారు. ఆసుపత్రులు.. స్కూళ్లు.. ఎమర్జెన్సీ సర్వీసెస్ బిల్డింగ్ లాంటి వాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నగరంలోని చాలా బ్రిడ్జిలు దెబ్బ తిన్నట్లుగా చెబుతున్నారు. ఈ మంటల్ని పూర్తిగా ఆర్పివేయటానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. జాస్పర్ నుంచి వస్తున్న ద్రశ్యాలు తనను కలిచివేస్తున్నాయని.. అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సహాయక సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది ఇదే నగరం వద్ద వ్యాపించిన కార్చిచ్చు కారణంగా 22 లక్షల హెక్టార్లు అగ్నికి ఆహుతైంది.