ఒత్తిడికి అదిరే చిట్కా.. రోజుకు 4 హగ్గులు
ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి విరుగుడు కలిగించే మార్గాల మీద అంతకంతకూ ఫోకస్ పెరుగుతోంది.
By: Tupaki Desk | 4 Jan 2025 6:30 PM GMTపోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో కాలం గడిచిపోతోంది. మారిన కాలానికి తగ్గట్లు మనుషుల ఆలోచనలు మారుతున్నాయి. దీంతో.. తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. అంత ఒత్తిడి ఎందుకు? అన్న సందేహం రావొచ్చు. కానీ.. అందులో నుంచి బయటకు రాలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి విరుగుడు కలిగించే మార్గాల మీద అంతకంతకూ ఫోకస్ పెరుగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సినంత డబ్బులు.. హోదా.. అన్ని ఉన్నప్పటికి.. వెంటాడి వేధించే ఒత్తిడితో చిత్తు అవుతున్న దుస్థితి. ఇలాంటి వేళ.. ఒత్తిడి నుంచి బయటకు వచ్చేందుకు రకరకాల మార్గాల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వేళ.. రోటీన్ కు భిన్నంగా కాస్తంత రొమాంటిక్ టచ్ తో ఒత్తిడికి చెక్ పెట్టే ఒక విధానాన్ని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
అదేమంటే.. ఇష్టమైన వ్యక్తుల్ని రోజుకు నాలుగు సార్లు హత్తుకోమని చెబుతున్నారు. ఇలాంటి హగ్గులతో ఒత్తిడి కచ్ఛితంగా మటుమాయం అవుతుందని వారు చెబుతున్నారు. అదెలా చెబుతారు? దానికి ఉన్న శాస్త్రీయత ఏమిటి? అని ప్రశ్నించే వారికి కూడా వారు బదులిస్తూ.. ఇష్టమైన వ్యక్తుల్ని కౌగిలించుకున్నప్పుడు శరీరంలో డోపమైన్.. సెరాటోనిన్.. ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయని.. అవి మానసిక ఆందోళనను..ఒత్తిళ్లను దూరం చేస్తాయని చెబుతున్నారు.
అంతేకాదు.. ఇటీవల కాలంలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగు చూసింది. అదేమంటే.. పది సెకన్ల హగ్.. ఒత్తిడిని తగ్గించటమే కాదు రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. అదే 20 సెకన్ల పాటు ఇష్టమైన వారిని హగ్ చేసుకొని ఉంటే.. రక్తపోటు అదుపులో ఉండటమే కాదు.. ఒత్తిడి వల్ల శరీరంలో విడుదలయ్యే విషతుల్యాలు ఆగిపోతాయని కూడా చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కారణం..ఈ విషయాలన్ని ఫోర్బ్స్ పత్రికలో పబ్లిష్ కావటమే దీనికి కారణం. సో.. ఒత్తిడికి గురవుతున్నామన్న ఆందోళన కన్నా.. ఇష్టమైన వ్యక్తుల్ని పది నుంచి ఇరవై సెకన్ల వరకు అలా హగ్ చేసుకొని ఉండిపోండి. మార్పు ఉందేమో చెక్ చేసుకోండి. తేడా వస్తే.. పోయేదేముంది చెప్పండి?