Begin typing your search above and press return to search.

మచ్చుకైనా కనిపించని మానవత్వం.. రెండు కాళ్లు నుజ్జునుజ్జయినా ఫొటోల కోసం పోటీ!

ఎవరైనా ఏదైనా ప్రమాదం బారిన పడితే ముందుగా వారిని కాపాడాల్సింది పోయి తమ సెల్‌ఫోన్లకు పని చెప్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 7:12 AM GMT
మచ్చుకైనా కనిపించని మానవత్వం.. రెండు కాళ్లు నుజ్జునుజ్జయినా ఫొటోల కోసం పోటీ!
X

ఇటీవల ఓ కోతి కరెంటు షాక్‌కు గురై రైలు పట్టాలపై పడిపోయింది. దాంతో మిగితా కోతులు వెంటనే అక్కడకు చేరుకొని.. ఆ కోతి కళేబరాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాయి. కాసేపు అక్కడే ఏడ్చినంత పనిచేశారు. అలాగే.. ఏదేని పరిస్థితిలో ఓ కాకి చనిపోతే కూడా అక్కడికి వందల సంఖ్యలో కాకులు వచ్చి చేరడాన్ని చూస్తుంటాం. కానీ.. మనుషుల్లో మాత్రం రోజురోజుకూ మానవత్వం లోపిస్తోంది.

ఎవరైనా ఏదైనా ప్రమాదం బారిన పడితే ముందుగా వారిని కాపాడాల్సింది పోయి తమ సెల్‌ఫోన్లకు పని చెప్తున్నారు. దర్జాగా ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోతున్నారు. ఎదుటి వ్యక్తి ఎంతలా ఇబ్బందులు పడుతున్నా కనీసం అంబులెన్స్‌కు ఫోన్లు చేయకుండా రికార్డు చేయడం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తోటి మనిషికి సాయం చేయాలన్న విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. అందుకే.. ఒక్కోసారి వీరిని చూసినప్పుడల్లా వీరికన్నా జంతువులే నయం అన్న అభిప్రాయం కలుగకమానదు.

ఒక వ్యక్తి చనిపోతే తాను పెంచుకున్న కుక్క సైతం తీవ్ర స్థాయిలో బాధపడుతుంటుంది. ఇటీవల రతన్ టాటా చనిపోతే అతని పెంపుడు కుక్క ఆయన మృతదేహం వద్దే ఉండడాన్ని చూశాం. ఎన్ని గంటలైనా అది అక్కడి నుంచి కదల్లేదు. కానీ.. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడితే కాపాడాల్సింది పోయి జనాలు పట్టించుకోలేదు. 108 అంబులెన్స్ వచ్చే వరకూ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ ఉన్నారు తప్పితే.. కనీసం అతని వద్దకు వెళ్లి ఓదార్చిన వారు లేరు.

కీసర ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌కు చెందిన వి.ఏలేందర్ కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. ఏలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. దాంతో ఆయన రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు గమనించి ఒక్కసారిగా కేకలు వేసేసరికి.. లారీ డ్రైవర్ తన లారీని రివర్స్ చేశాడు. దీంతో లారీ టైర్ల కింద ఎలేందర్ కాళ్లు చిక్కుకుని నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డాడు. చుట్టుముట్టిన జనం చూస్తూ ఉండిపోయారే తప్పితే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఎవరూ చేయలేదు. కేవలం 108కి సమాచారం ఇచ్చి అక్కడి ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేస్తూ ఉండిపోయారు. కాసేపటికి అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లే లోగానే అతను చనిపోయాడు. ఏలేందర్‌ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే బతికేవాడన్న అభిప్రాయాలు వైద్యులు చెప్పారు.