అంగారకుడిపై నగరం... టైం చెబుతున్న ఎలాన్ మస్క్!
అవును... అంగారక గ్రహంపై ఎలాన్ మస్క్ కు ఉన్న ఆసక్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "నేను అంగారక గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నాను.." అంటూ గతంలో ఓ సారి ఆయన వ్యాఖ్యానించారు కూడా.
By: Tupaki Desk | 18 May 2024 4:24 AM GMTభూమిపైనే కాకుండా మరో గ్రహంపై కూడా మానవాళి జీవనం సాగించాలని శాస్త్రవేత్తలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే! మరోపక్క... అది ఏమాత్రం సాధ్యం కాదని.. ఆ అవకాశం భూమికి మాత్రమే ఉందని మరికొంతమంది వాదిస్తుంటారు. అయితే... స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే త్వరలో అంగారకుడిపై సిటీ నిర్మిస్తామని అంటున్నారు!
అవును... అంగారక గ్రహంపై ఎలాన్ మస్క్ కు ఉన్న ఆసక్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "నేను అంగారక గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నాను.." అంటూ గతంలో ఓ సారి ఆయన వ్యాఖ్యానించారు కూడా. ఈ క్రమంలో మరోసారి ఆ గ్రహంపై తనకున్న ఆసక్తిని వెల్లడించారు మస్క్. ఇందులో భాగంగా... అంగారక గ్రహంపై మానవరహిత ఉపగ్రహాన్ని పంపడం.. అనంతరం మానవసహిత యాత్ర చేపట్టడం, అప్పుడు అక్కడ ఒక సిటీ నిర్మించడం వంటి విషయాలు వెల్లడించారు.
ఈ క్రమంలో... తాజాగా మరో 30 ఏళ్లలో అంగారకుడిపై నగరం ఏర్పడటమే గాక.. అక్కడ మనుషులు కూడా జీవిస్తారని ఆయన అంచనా వేస్తూ ఎలాన్ మస్క్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ గ్రహంపై ఎలాన్ మస్క్ అమితాసక్తి కనబర్చడం ఇదే తొలిసారి కాదు. అంగారకుడిపైకి 10 లక్షల మందిని తరలించేందుకు ఓ గేమ్ ప్లాన్ ను రూపొందిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా.. "ఐదేళ్లలోపే అంగారక గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంది. 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతాం. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం. కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది" అని ఎలాన్ మస్క్ తాజాగా ఎక్స్ లో రాసుకొచ్చారు.
కాగా... భవిష్యత్తులో అంగారక గ్రహంపై చేపట్టే ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ "స్టార్ షిప్" పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ను అభివృద్ధి చేస్తోంది. సుమారు 500 అడుగుల పొడవు ఉండే రాకెట్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ హెవీ రాకెట్ల కంటే 20శాతం పెద్దది కావడం విశేషం. ఈ రంగంలో ఎలాన్ మస్క్ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఆకాంక్షను, లక్ష్యాన్ని వెల్లడించారు!