Begin typing your search above and press return to search.

కేంద్రంలో హంగ్....రాష్ట్రపతికి మాజీ న్యాయమూర్తుల లేఖ

Hung Parliament in India

By:  Tupaki Desk   |   4 Jun 2024 1:26 AM GMT
కేంద్రంలో హంగ్....రాష్ట్రపతికి మాజీ న్యాయమూర్తుల లేఖ
X

కేంద్రంలో హంగ్ వస్తుందా అదేంటి జూన్ 1న సాయంత్రం నుంచి అదే పనిగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి 370 నుంచి 380 దాకా ఎంపీ సీట్లు గెలుస్తుందని తెగ ఊదరగొట్టారు అంటే అది ఎగ్జిట్ పోల్ అని ఇండియా కూటమి ఇప్పటికే తీసి పక్కన పెట్టేసింది. అంతే కాదు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు దేశ రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్న వారు సైతం ఆ విషయాన్ని పెద్దగా నమ్మడం లేదు.

అంత వరకూ ఎందుకూ బీజేపీ సానుభూతిపరులు కూడా అన్ని సీట్లు కాషాయం పార్టీకి రావనే అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ కి బీజేపీ చేరుకుంటే చాలు అన్నది వారి లోపల భావనగా ఉంది. ఇక పోతే 2019 కంటే చాలా గొప్పగా ఈసారి విపక్షాలు పెర్ఫార్మెన్స్ చేశాయి.

ఇండియా కూటమి కట్టి బీజేపీని ఉత్తరాదిన బాగానే నిలువరించే ప్రయత్నం చేశాయి. బీజేపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. అంతే కాదు కేవలం మోడీని విమర్శించడమో బీజేపీని తిట్టడమో చేయకుండా ఇండియా కూటమి ప్రజల సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వివరించింది.

రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ప్రియాంకా గాంధీ వంటి వారు ప్రజలకు అర్ధమయ్యే తీరులో చేసిన ప్రసంగాలు బాగానే ప్రభావం చూపాయని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఈసారి బీజేపీకి కానీ ఎన్డీయే కూటమికి కానీ మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా నంబర్ రాదు అని ఒక విశ్లేషణ వినిపిస్తోంది.

దానికి తోడు అన్నట్లుగా మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి ఒక లేఖ రాసారు. ఆ లేఖలో వారు ఒకవేళ దేశంలో హంగ్ పరిస్థితే ఏర్పడితే అతి పెద్ద కూటమినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మొదట ఆహ్వానించాలని కోరారు. ఒకవేళ ప్రస్తుత అధికార పక్షం ప్రజల మద్దతు పొందకపోతే అధికార మార్పిడి సులువుగా సాగకపోవచ్చునని అది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చునని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.

ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితులు ఉత్పన్నం అయినపుడు అతి పెద్ద కూటమినే ఆహ్వానించడం మంచిందని వారు ఆ లేఖలో సూచించారు. రాష్ట్రపతికి రాసిన లేఖలో ఏడుగురు మాజీ న్యాయమూర్తులు సంతకాలు చేశారు. వారిలో మద్రాస్ హై కోర్టు మాజీ న్యాయమూర్తులు అయిన ఆరుగురు జీఎం అక్బర్ అలీ, అరుణ జగదీశన్, డి హరిపరంధామన్, పి ఆర్ శివకుమార్, సిటీ సెల్వం, ఎస్ విమలల ఉన్నారు.

అలాగే పాటు పాట్నా హై కోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్ సైతం ఈ బహిరంగ లేఖ మీద సంతకం చేశారు. కొద్ది గంటలలో పూర్తి ఫలితాలు రానున్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ లేఖ రాయడం వెనక ఆంతర్యం ఏమిటి అన్నది ఢిల్లీ రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.