అద్భుతః... అంతరిక్షం నుంచి మిల్టన్ హరికేన్ ఇలా ఉంది!
అక్టోబర్ 9 తర్వాత పశ్చిమ తీరాన్ని తాకనున్న బలమైన నాలుగో కేటగిరీ తుఫాను.. మిల్టన్ హరికేన్ రాక కోసం ఫ్లోరిడా సిద్ధమైందని అంటున్నారు.
By: Tupaki Desk | 10 Oct 2024 2:30 AM GMTఅక్టోబర్ 9 తర్వాత పశ్చిమ తీరాన్ని తాకనున్న బలమైన నాలుగో కేటగిరీ తుఫాను.. మిల్టన్ హరికేన్ రాక కోసం ఫ్లోరిడా సిద్ధమైందని అంటున్నారు. ఈ సమయంలో లక్షలాది మంది ఫ్లోరిడా ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయాలనే ఆదేశాలు అందుకున్నారు. ఈ హెచ్చరికను విస్మరించినవారు భయంకరమైన పోరాటాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.
సుమారు 3.3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసించే టంపా బే ప్రాంతంలో మిల్టన్ హరికేన్ తాకినప్పుడు విస్తృతంగా విధ్వంసం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వం... 100 సంవత్సరాలలో అత్యంత ఘోరమైన తుఫాన్ లలో ఇది ఒకటి అని ప్రకటించింది.
ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా సన్ షైన్ స్టేట్ కి ఎదురుగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం వైపు తూర్పు దిశగా పయనిస్తోందని చెబుతున్నారు. ఇదే సమయంలో మిల్టన్ పరిమాణం పెరుగుతోందని, తుఫాను గాలులు గత 24 గంటల్లో 105 నుంచి 125 మైళ్ల వరకూ విస్తరించారయని అంటున్నారు. బలమైన గాలులతో వర్షం మొదలవ్వనుందని చెబుతున్నారు.
మరోపక్క ఫ్లోరిడాలో భారీ హరికేన్ తో పోరాడుతున్న వారిలో వేలాది మంది బ్రిటీషర్లు ఉన్నారని అంటున్నారు. దీంతో విదేశాంగ కార్యాలయం ఫ్లోరిడాలో ఉన్నవారికి, అటుగా ప్రయాణిస్తున్నవారిని హెచ్చరించింది. ఆ సంగతి అలా ఉంటే... మిల్టన్ హరికేన్ అంతరిక్షం నుంచి చేస్తే ఎలా ఉంటుందో ఓ వ్యోమగామి వీడియో తీసి పంపించారు. ఇది వైరల్ గా మారింది.
అవును... ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో స్పేస్ ఎక్స్ క్రూ-8 మిషన్ కు కమాండర్ గా ఉన్న మాథ్యూ డొమినిక్.. మిల్టన్ హరికేన్ తుఫాను ఎలా ఉంటుందో వీడియో తీసి, ఆ ఫుటేజీని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా... మేము ఈ రోజు సుమారు రెండు గంటల క్రితం మిల్టన్ హరికేన్ మీదుగా ప్రయాణించాము.. ఇది నిన్న స్పష్టంగా లేదు కానీ ఈ రోజు మాత్రం పెద్దదిగా కనిపించింది అని తెలిపారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు తమ అద్భుత వీక్షణ అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఇదొక అద్భుతం అని నొక్కి చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది!