భార్యకు మేసేజ్ లు పంపాడని కుడి చేతిని నరికేశారు
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది.
By: Tupaki Desk | 18 Feb 2025 6:30 AM GMTఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. నిడమర్రు మండలం బావాయిపాలేనికి చెందిన 26 ఏళ్ల ఏసురాజు కనిపించకుండా పోయాడు. ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు అతడి కుడి చేతిని గుర్తించారు. కుడి చేయి లభించినా.. అతడి డెడ్ బాడీ మాత్రం దొరకలేదు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది.
ప్రియురాలి భర్త.. మామలే ఏసురాజును హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరికి మరో వ్యక్తి కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఏసురాజు కుడి చేతిని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో హత్యకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ సమాచారం బయటకు వెల్లడించనట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగానే ఈ అరెస్టును ఇంకా చూపించలేదని చెబుతున్నారు.
అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏసుబాబు ఒక వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని.. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు భర్త.. పలుమార్లు ఏసురాజును పద్దతి మార్చుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. దీంతో భరించలేని ఆవేశానికి గురైన భర్త.. మామతో కలిసి అతడ్ని హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల (శనివారం) అత్తింట్లో తన భార్యతో ఏసు రాజు ఉన్న విషయాన్ని తెలుసుకున్న భర్త భరించలేకపోయాడు.
ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు. వీరిద్దరు కలిసి మరొకరి సాయాన్ని తీసుకొని.. ఏసురాజును బావాయిపాలెనికి తీసుకొచ్చారు. ఆమెకు తరచూ మెసేజ్ పంపే కుడి చేతిని పదునైన కత్తితో సగానికి నరికేసి.. పంట కాలువలో అతడ్ని పడేసి ముగ్గురు పరారయ్యారు. తీవ్రమైన రక్తస్రావంతో ఏసురాజు చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.