రోజూ రూ.5,000 ఇస్తేనే కాపురం... స్టేషన్ కి చేరిన టెకీ ఫ్యామిలీ వ్యవహారం!
ఈ సమయంలో మరో వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 20 March 2025 6:00 PM ISTఇటీవల కాలంలో భార్యాబాధితులైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జాబితా తీవ్ర సంచలనంగా మరుతోన్న సంగతి తెలిసిందే. భార్యల వేధింపులు తాళలేక ఇటీవల పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సెల్ఫీ వీడియోలు తీసుకుని, సూసైడ్ నోట్లు రాసిపెట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సమయంలో మరో వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... ఇటీవల "మెన్ టూ" అనే హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. భార్యా బాధితుల గురించి కూడా సమాజం, వ్యవస్థలూ ఆలోచించాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో తానూ భార్యా బాధితుడినే అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్ లో కన్నీరు పెట్టుకున్నారు. అయితే... భార్య వెర్షన్ మరోలా ఉంది!
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరులో పనిచేస్తోన్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఓ యువతితో 2022లో వివాహమైంది. దీంతో.. వీరిరువురూ సంపిగెహళ్లిలో కాపురం పెట్టారు. అయితే... ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తోన్న అతడిని భార్య నిత్యం వేధిస్తోందని.. జూమ్ కాల్ లో ఉన్న సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్ లు చేస్తోందని అతడు ఆరోపిస్తున్నాడు.
ఈ మేరకు బెంగళూరు పరిధిలోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ లో సదరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా... తనను భార్య నిత్యం వేధిస్తోందని.. అకారణంగా దూషిస్తోందని.. కాపురం చేయాలంటే షరతులు పెడుతోందని.. ప్రతీ రోజూ రూ.5,000 ఇస్తేనే కాపురం చేస్తానంటోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదే సమయంలో... అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోయినా, చెప్పింది చెప్పినట్లు చేయకపోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని తెలిపాడు! అయితే.. విడాకులు తీసుకుందామని అంటే రూ.45 లక్షలు డిమాండ్ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోపక్క తన అందం దెబ్బతింటుందనే కారణం చెబుతూ పిల్లలను కనడానికి నిరాకరిస్తోందని.. అందుకు బదులుగా పిల్లలను దత్తత తీసుకోవాలని పట్టుబడుతోందని అతడు ఆరోపించారు. దీంతో.. ఈ విషయం వెలుగులోకి తీవ్ర సంచలనంగా మారింది!
అయితే... ఈ వ్యవహారంపై అతడి భార్య వెర్షన్ మరోలా ఉంది. తన భర్త మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనపై కావాలనే నిందలు వేస్తున్నాడని ఆమె ఆరోపించారు.