'బట్టతల' ఉందని భార్య 'సింగిల్' స్టేటస్... భర్త ఆత్మహత్య!
భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల జాబితా ఇటీవల పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 March 2025 11:07 AM ISTఇటీవల కాలంలో భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనప్పటికీ... తన భార్యల వేధింపులు తారాస్థాయికి చేరుకుంటున్నాయని చెబుతూ.. సెల్ఫీ వీడియోలు తీసుకుని, సూసైడ్ లేఖలు రాసి ఇటీవల కాలంలో చాలా మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమయంలో తాజాగా మరో వ్యక్తి ఈ పనికి పూనుకున్నారు.
అవును... భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల జాబితా ఇటీవల పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ జాబితాలో మరో వ్యక్తి చేరారు. అయితే... బట్టతల అంటూ కట్టుకున్న భార్యే అవహేళన చేయడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర తాలూకాలోని ఉడిగాలలో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.
పోలీసులు చెబుతోన్న వివరాల ప్రకారం... పరమశివమూర్తి (32)కి మమతతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పరమశివమూర్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు పెళ్లి సమయానికే బట్టతల ఉంది. కాకపోతే పెళ్లి తర్వాత ఉన్న కాస్త జుట్టు కూడా రాలిపోయింది. దీంతో భార్య సూటిపోటి మాటలతో అతనిని వేధించేది!
నీకు నెత్తి మీద జుట్టు లేదు.. నీతో బయటకు రావాలంటే సిగ్గుగా ఉంది.. వంటి మాటలు అనేది! దీంతో... తరచూ ఇద్దరి మధ్యా ఈ విషయంపై గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో... భర్తపై గృహహింస, కట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు పరమశివమూర్తి. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.
అయితే... జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన పరమ శివమూర్తి.. భార్య సోషల్ మీడియాలోని స్టేటస్ "సింగిల్" అని ఉండటం చూసి మరింత ఆవేదన చెందాడు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఓ నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చెసుకున్నాడు. దీంతో... ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.