Begin typing your search above and press return to search.

ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి భార్యను చంపేశారు!

బంధాలపై కొత్త సందేహాలు వచ్చేలా ఇటీవల కొన్ని దారుణ నేరాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   31 Oct 2024 12:30 PM GMT
ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి భార్యను చంపేశారు!
X

బంధాలపై కొత్త సందేహాలు వచ్చేలా ఇటీవల కొన్ని దారుణ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుందీ ఉదంతం. ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి కట్టుకున్న భార్యను హత్య చేసిన షాకింగ్ ఉదంతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. ఈ దారుణానికి కారణమైన భర్తను.. అతడి ఇద్దరు ప్రియురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. షాకింగ్ నిజాల్ని వెల్లడించారు.

24 ఏళ్ల ప్రద్యుమ్న కుమార్ కు నాలుగేళ్ల క్రితం శుభశ్రీ అనే మహిళతో పెళ్లైంది. వీరి వివాహానికి ముందు కొంతకాలం పాటు వీరు డేటింగ్ లో ఉన్నారు. పెళ్లైన తర్వాత కొన్ని రోజుల నుంచి భార్యను టార్చర్ పెట్టటం మొదలు పెట్టాడు. దీంతో.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఓవైపు భార్యతో గొడవపడిన అతనికి ఒక నర్సుతో పరిచయమైంది. అది కాస్తా స్నేహంగా మారి.. హద్దులు దాటేసింది.

తనకు పరిచయమైన నర్సు సాయంతో మరో నర్సు (రోజీ)తో పరిచయమైంది. వీరు ముగ్గురు కలిసి అన్ని హద్దులు దాటేశారు. ఈ క్రమంలో భార్య అడ్డును తొలగించుకునేందుకు వీలుగా ఇతడో దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. దానికి ఇద్దరు ప్రియురాళ్లు ఓకే చెప్పేశారు. భార్యను చంపేసే ప్లాన్ ను అమలు చేసేందుకు ఈ నెల 27న ప్రద్యుమ్న తన భార్యను తీసుకొని సాంపున్ లోని రోజీ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ఎక్కువ మొత్తంలో మత్తుమందును ఎక్కించారు. దీంతో.. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.

తమ పథకంలో భాగంగా తర్వాతి రోజున ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు భార్యకు ఏమైందని అడగ్గా.. ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె చనిపోయినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద మరణంగా భావించి ఆమెకు పోస్టుమార్టం నిర్వహించారు. అందులో అధిక మోతాదులో మత్తు ఎక్కటం కారణంగా ఆమె మరణించినట్లుగా గుర్తించారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. ఈ కేసుపై మరింత లోతుల్లోకి వెళ్లి విచారణ చేపట్టారు. దీని వెనుకున్న కుట్రను చేధించారు. ప్రద్యుమ్న.. అతడి ఇద్దరు ప్రియురాళ్లైన నర్సుల్ని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తాము చేసిన నేరాన్ని వారు అంగీకరించటంతో రిమాండ్ కు తరలించారు.