Begin typing your search above and press return to search.

కోర్టు నుంచి వస్తున్న భర్తను కిడ్నాప్ చేసిన భార్య!

మీరు చదివింది అక్షరాల నిజం. తెలంగాణలోని హుస్నాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది

By:  Tupaki Desk   |   7 April 2024 6:21 AM GMT
కోర్టు నుంచి వస్తున్న భర్తను కిడ్నాప్ చేసిన భార్య!
X

మీరు చదివింది అక్షరాల నిజం. తెలంగాణలోని హుస్నాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. విడాకుల కేసులో కోర్టులో హాజరై ఇంటికి వెళుతున్న భర్తను.. కొందరితో కలిసి కిడ్నాప్ కు ప్రయత్నించిన భార్య ఉదంతమిది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి.. అందులో భాగంగా కొంత సెటిల్ మెంట్ మొత్తాన్ని రాబట్టుకోవటానికి తన వాళ్లతో భార్య ఈ భారీ ప్లాన్ వేసింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం చూస్తే.. ఈ ఉదంతం మారుతున్న మైండ్ సెట్ కు నిదర్శనంగా మారిందని చెప్పాలి.

అక్కన్నపేట మండలానికి చెందిన సురేష్ .. మద్దూరు మండలానికి చెందిన మాధవిలు భార్యభర్తలు. వారి మధ్య నెలకొన్న గొడవల కారణంగా వారిద్దరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. దీనికి సంబంధించిన కేసు హుస్నాబాద్ కోర్టులో నడుస్తోంది. శనివారం కోర్టుకు హాజరైన సురేశ్.. తిరిగి తన టూవీలర్ మీద ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో వాహనాన్ని రిపేర్ కోసం మెకానిక్ షాపు వద్ద ఆపాడు.

ఈ క్రమంలోనే భార్య తరఫు బంధువులు కారులో వచ్చి.. అతడ్ని కారులో ఎక్కాలని చెప్పి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. దీన్ని గుర్తించిన స్థానికులు సురేశ్ బంధువులకు ఈ సమాచారాన్ని అందించారు. వెంటనే వారు సురేశ్ తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. వారు స్పందించి అక్కన్నపేట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి.. తమ కొడుకు ఆచూకీని గుర్తించాలని కోరారు.

దీంతో స్పందించిన పోలీసులు ఇదే సమాచారాన్ని హుస్నాబాద్ పోలీసులకు అందించి.. సురేశ్ వెళుతున్న దారిని గుర్తించే ప్రయత్నం చేశారు. సురేశ్ ను తీసుకెళుతున్న కారు జనగామ వైపు వెళుతున్నట్లుగా గుర్తించి వారిని వెంబడించి.. అదుపులోకి తీసుకున్నారు. సరేశ్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా భార్య మాధవితో పాటు ఆమె బంధువుల్ని అదుపులోకి తీసుకున్నారు. విడాకులు ఇచ్చినందుకు సురేశ్ కొంత మొత్తాన్ని భార్యకు ఇస్తానని మాట ఇవ్వటం.. దాన్ని ఇవ్వకపోవటంతో కిడ్నాప్ చేసి బలవంతంగా అతడి నుంచి వసూలు చేద్దామనుకున్న ప్లాన్ దారుణంగా విఫలమై.. చివరకు రివర్సులో కేసుగా మారింది. భర్త కిడ్నాప్ కు యత్నించిన భార్య ఉదంతం సంచలనంగా మారింది.