Begin typing your search above and press return to search.

హైడ్రా ఆందోళనల్లో హైదరాబాదీలు... ఒక్కొక్కరిదీ ఒక్కో వ్య(క)థ!

అవును... హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించిన చర్చే జరుగుతున్న పరిస్థితి.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:30 PM GMT
హైడ్రా ఆందోళనల్లో హైదరాబాదీలు... ఒక్కొక్కరిదీ ఒక్కో వ్య(క)థ!
X

గతకొన్ని రోజులుగా హైదరాబాద్ లో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో... హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా ఆందోళన ఎక్కువగా నెలకొందనే చర్చ బలంగా మొదలైంది. ఈ విషయంలో మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గాలు అనే తారతమ్యాలు ఏమీ లేవు! ఎంత చెట్టుకు అంతగాలి.. ఎవరి స్థాయిలో ఎవరి ఆందోళన వారిది అని చెబుతున్నారు.

అవును... హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించిన చర్చే జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో... బిలియనీర్లు, మిలియనీర్లు, రాజకీయ నాయకుల సంగతి కాసేపు పక్కనపెడితే.. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. ఒక్కో వ్యథ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ప్రధానంగా ఫుల్ ట్యాక్ లెవెల్ (ఎఫ్.టీ.ఎల్), బఫర్ జోన్ లోని నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్న నేపథ్యంలో... ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు. వీరిలో ఇప్పటికే కొంతమందికి వారం, పది రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ హైడ్రా నుంచి నోటీసులు వస్తున్నాయని చెబుతున్నారు.

అలా ఎప్పటి నుంచో ఉంటున్న ఇంటిని, రెక్కలు ముక్కలు చేసుకుని నిలబెట్టుకున్న నివాసాన్ని, ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్న ఫ్లాట్ లను వారం రోజుల్లో ఖాళీ చేయమనే నోటీసులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికీ చాలా మందికి నోటీసులు అందనప్పటికీ... మీడియాలో వస్తోన్న కథనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ దుర్గం చెరువు చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు సంబంధించి 240 మందికి.. కూకట్ పల్లి, బాలానగర్, చందానగర్, మేడిపల్లి ప్రాంతాల్లోని సరస్సుల సమీపంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి సుమారు 315 మందికి నోటీసులు అందజేశారని చెబుతున్నారు. దీంతో... వారిలో మెజారిటీ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు.

వీరిలో రిటైర్డ్ అయ్యి.. వచ్చిన పీఎఫ్ అమౌంట్ తో ఒక ఫ్లాట్ కొనుక్కుని, రిటైర్మెంట్ లైఫ్ ని ప్రశాంతంగా గడుపుతున్న సీనియర్ సిటిజన్స్ ఉన్నారు... సుమారు 15 ఏళ్లుగా ఈఎంఐ లు కడుతున్న ఎంప్లాయిస్ ఉన్నారు... ఇటీవలే ఈఎంఐ పూర్తయ్యింది, ఇళ్లు పూర్తిగా సొంతమైందన్న ఆనందంలో ఉన్న వాళ్లూ ఉన్నారు.. రూపాయి రూపాయి కూడబెట్టి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నవాళ్లూ ఉన్నారు.

ఇలా ఎంతో మంది ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కరిదీ ఒక్కో కథ! వీరంతా నిన్నమొన్నటివరకూ తమ తమ సొంత ఇళ్లల్లో సంతోషంగా ఉంటున్న సమయంలో.. వారిపై ఉన్నపలంగా హైడ్రా పిడుగు పడిందని అంటున్నారు. దీంతో... తెలంగాణ ముఖ్యమంత్రి, హైడ్రా ఈ విషయంలో వీరి వీరి సమస్యలను పరిగణలోకి, సరైన పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.