Begin typing your search above and press return to search.

వెంటాడిన మృత్యువు : తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్ డాక్టర్

హైదరాబాద్ కు చెందిన లేడీ డాక్టర్ ట్రాజిక్ యాక్సిడెంట్ లో మృత్యువాతపడ్డారు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 7:33 AM GMT
వెంటాడిన మృత్యువు : తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్ డాక్టర్
X

భూమి మీద నూకలు రాసిపెట్టి ఉంటే ఎక్కడున్న బతుకుతారు అంటారు. అయితే నూకలు తీరిపోతే ఎక్కడికెళ్లినా మరణం తప్పదు. విధి ఆడే వింత నాటకంలో సమిధులుగా మారాల్సిందే. హైదరాబాద్ కు చెందిన లేడీ డాక్టర్ ట్రాజిక్ యాక్సిడెంట్ లో మృత్యువాతపడ్డారు. ఇది విషాదం నింపింది.

హృదయ విదారక ఈ ఘటనలో హైదరాబాదుకు చెందిన ఓ యువ డాక్టర్ తన స్నేహితులతో కలిసి హంపి, కర్ణాటకలో విహారయాత్రకు వెళ్లినప్పుడు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ అనన్యరావు తన స్నేహితులతో కలిసి తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ లేడీ డాక్టర్ 25 అడుగుల ఎత్తున్న ఒక రాయి నుంచి నదిలోకి దూకగా బలమైన ప్రవాహం ధాటికి ఆమెను కొట్టుకుపోయింది.

కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు , ఆమె స్నేహితులు మంగళవారం హంపికి చేరుకుని, సనాపూర్ గ్రామంలోని ఒక అతిథిగృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం వారు తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఆమె పెద్ద రాయి నుంచి నదిలోకి దూకగానే ప్రవాహం ఆమెను లోపలికి లాక్కెళ్లింది. ఆమెను రక్షించేందుకు స్నేహితులు, స్థానికులు ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు.

స్థానిక పోలీసులు, నిపుణులైన గజఈతగాళ్లతో కూడిన రక్షణ బృందం వెంటనే గాలింపు చేపట్టింది. తుంగభద్ర నది ఆ ప్రాంతంలో రాతి గుహల మధ్యగా ప్రవహించడం వల్ల రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. గంటల తరబడి శోధించిన తర్వాత గురువారం ఉదయం డాక్టర్ అనన్యరావు మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులు , స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

డాక్టర్ అనన్యరావు నదిలోకి దూకుతున్న వీడియో ఆమె స్నేహితులలో ఒకరు చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.