సర్వే సంచలనం: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ స్థానం ఎంతంటే..?
హైదరాబాద్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి బిర్యానీలకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు.
By: Tupaki Desk | 15 Nov 2024 12:30 PM GMTహైదరాబాద్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి బిర్యానీలకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడ ఫుడ్‌ను ఇష్టపడి మరీ లాగించేస్తుంటారు. అలా చాలా సందర్భాల్లోనూ చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు కూడా. దాంతో ఒకప్పుడు ఫుడ్ పరంగా ఎన్నో స్టార్ రేటింగ్స్‌ను హైదరాబాద్ సొంతం చేసుకుంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
హైదరాబాద్ బిర్యానీని నార్త్ నుంచి వచ్చిన వారు కానీ.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కానీ ఇష్టపడి తింటుంటారు. అంతేకాదు.. ఇక్కడి నుంచి నిత్యం విదేశాలకు బిర్యానీలు వేలాది సంఖ్యలో పార్శిల్ అవుతూనే ఉంటాయి. అయితే.. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ తినాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బయట రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేయాల్సిన దుస్థితి వచ్చింది.
ఇటీవల పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ స్టాళ్లపై అధికారులు చేసిన దాడుల్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన చికెన్, పురుగుల పట్టిన మసాలాలు, నిల్వ చేసిన ఆహార పదార్థాలను వాడడం కనిపించింది. చాలా వరకు ఫుడ్ కోర్టులను ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. కొన్నిచోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు అవశేషాలు వెలుగుచూశాయి.
తాజాగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే సంచలన విషయాన్ని వెల్లడిచించింది. నిత్యం ఫుడ్ విషయంలో ఫైవ్ స్టార్ రేటింగ్స్‌తో దూసుకెళ్లే హైదరాబాద్ ఇప్పుడు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ నగరం ఇప్పుడు చివరి ప్లేసులో నిలిచింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ సర్వేలో వెలుగుచూసింది. 62 శాతం హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. దీంతో చివరి స్థానానికి పడిపోయినట్లుగా సర్వే పేర్కొంది.