Begin typing your search above and press return to search.

కొబోయే భార్యను భయపెట్టే సరదాతో చచ్చిపోయాడు

సరసం సున్నితంగా ఉండాలి. హద్దులు దాటితే అనూహ్య విషాదానికి కారణమవుతుంది. మన పెద్దోళ్లు అప్పుడెప్పుడో సరసం విరసం కాకూడదంటూ సామెతతో హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   5 March 2025 9:10 AM IST
కొబోయే భార్యను భయపెట్టే సరదాతో చచ్చిపోయాడు
X

సరసం సున్నితంగా ఉండాలి. హద్దులు దాటితే అనూహ్య విషాదానికి కారణమవుతుంది. మన పెద్దోళ్లు అప్పుడెప్పుడో సరసం విరసం కాకూడదంటూ సామెతతో హెచ్చరించారు. కానీ.. అవేమీ పట్టని ఒక క్యాబ్ డ్రైవర్ చేతులారా తన ప్రాణాన్ని తానే తీసుకున్న షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన సరదా చర్యతో అతడి ప్రాణాలు పోవటమే కాదు.. రెండు కుటుంబాల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసిన దుస్థితి. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న కాబోయే భార్యను ఉడికించేందుకు.. భయపెట్టేందుకు సరదాగా ఉరి వేసుకుంటున్నట్లుగా చెప్పిన అతడు.. నిజంగానే ఉరితాడుకు బలైన షాకింగ్ ఘటనగా దీన్ని చెప్పాలి.

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో ఉండే పాతికేళ్ల ఆదర్శ్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఐదేళ్లుగా నల్లకుంటకు చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఇరువురికి ఇష్టం కావటం.. వారిద్దరి ప్రేమను రెండు కుటుంబాల తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. దీంతో ఏప్రిల్ లో వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సోమవారం అర్థరాత్రి వేళ కాబోయే భార్యను భయపెట్టేందుకు చేసిన ఒక సరదా చర్యతో ప్రాణాలు కోల్పోయాడు.

ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఐరన్ బాక్స్ వైరుతో ఉరేసుకుంటున్నట్లుగా సరదాగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఫోటో తీసి ఆమెకు పంపాలని భావించాడు. ఉరి వేసుకుంటున్నట్లుగా చూపించే తరుణంలో పొరపాటున ఐరన్ బాక్స్ వైరు ఆదర్మ్ మెడకు బలంగా బిగుసుకుంది. దీంతో.. ఊపిరి ఆడక చనిపోయాడు. అతడి మరణంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.