Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వాసికి జాక్ పాట్.. అదృష్టం అంటే ఈయనదే..

ఓ హైదరాబాద్ వాచ్‌మెన్‌కు అదృష్టం తట్టింది. దీంతో రాత్రికి రాత్రి అతని దశ తిరిగి కోటీశ్వరుడయ్యాడు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 3:30 PM GMT
హైదరాబాద్ వాసికి జాక్ పాట్.. అదృష్టం అంటే ఈయనదే..
X

అదృష్టం బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ వాచ్‌మెన్ పేరు చెప్పొచ్చేమో. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా తలుపుతడుతుందో చెప్పలేం. కొందరి జీవితాలు రాత్రికిరాత్రే మారిపోతుంటాయి. అలా జీవితాలు మారిపోయిన వారు చాలా సంఖ్యలోనే ఉన్నారు.

అలా.. ఓ హైదరాబాద్ వాచ్‌మెన్‌కు అదృష్టం తట్టింది. దీంతో రాత్రికి రాత్రి అతని దశ తిరిగి కోటీశ్వరుడయ్యాడు. హైదరాబాద్ నగరానికి చెందిన రాజమల్లయ్యది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచి కష్టాలను చూస్తూ పెరిగారు. ఇక పెళ్లి చేసుకున్న తరువాత ఆయన కష్టాలు మరిన్ని రెట్టింపయ్యాయి. అసలే పేదరిక కుటుంబం కావడం.. ఆపై భార్యా పిల్లలతో కుటుంబ పోషణ కూడా అతనికి గగణమైంది.

దీంతో కొన్ని సంవత్సరాల పాటు రాజమల్లయ్య నగరంలోనే కూలీ పనిచేశాడు. చిన్నా చితక పనులు చేసినా కుటుంబ పోషణ కష్టంగానే మారింది. ఇక ఇక్కడ ఉంటే బతకడం కష్టం అనుకున్నాడు. ఎలా అయినా డబ్బులు సంపాదించి తన కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వాలనుకున్నాడు. ఇందుకు లాటరీ తగిలితే జీవితం మారిపోతుందని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. ఒక్కసారి లాటరీ తగిలితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. దీంతో 30 ఏళ్లుగా రాజమల్లయ్య లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు.

30 ఏళ్ల నుంచి ఏనాడూ రాజమల్లయ్యను అదృష్టం వరించలేదు. దానికితోడు పిల్లలు పెద్ద కావడంతో వారిని పోషించుకునేందుకు తప్పనిసరి పరిస్థితిలో దుబాయి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఓ షేక్ ఇంట్లో వాచ్‌మెన్‌గా చేరాడు. అక్కడ వచ్చే జీతంతోనే బతుకుతున్నాడు. అందులో నుంచే కొంత ఇంటికి పంపించేవాడు. అయితే.. గత 30 ఏళ్లుగా లాటరీ కొనే అలవాటు ఉన్న రాజమల్లయ్య దుబాయిలోనూ లాటరీ కొనడం ప్రారంభించాడు. బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్స్ లక్కీ డ్రాకు సంబంధించిన లాటరీ ఇటీవల కొన్నాడు. తాజాగా ఆ సంస్థ లక్కీ డ్రా విన్నర్‌ను ప్రకటించింది. అందులో రాజమల్లయ్యకు లాటరీ తాకింది. లాటరీలో మిలియన్ దిర్హామ్స్ దక్కించుకున్నాడు. మన కరెన్సీలో అది రూ.2.32 కోట్లు. ఒకేసారి పెద్ద మొత్తంలో లాటరీ తగలడంతో రాజమల్లయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన వయసు ప్రస్తుతం 60 ఏళ్లని, 30 ఏళ్లుగా లాటరీ కోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు అదృష్టం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక తన కష్టాలు తీరనున్నట్లు ఆనందం వ్యక్తం చేశాడు.