సైబర్ నేరాల ముఠాకు చిక్కి జాబ్ కోసం లావోస్ వెళ్లి నరకం చూశాడు!
హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి అనుభవం గురించి తెలిస్తే నోట మాట రాదంతే.
By: Tupaki Desk | 11 Sep 2024 4:53 AM GMTహైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి అనుభవం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలాంటి మోసాలు కూడా మొదలయ్యాయా? అన్న ఆందోళన కలుగక మానదు. విదేశాల్లో ఉద్యోగం అన్నంతనే వెళ్లిన అతడికి.. తాను చిక్కుకున్నది సైబన్ నేరగాళ్ల వలలో అన్నది ఒక ఎత్తు అయితే.. వారి నుంచి ఎదురైన చిత్రహింసలు ఊహించలేనంతగా ఉండటం గమనార్హం.
విదేశాల్లో ఉద్యోగాలు అంటూ దేశం కాని దేశానికి తీసుకెళ్లి.. సైబర్ మోసాలు చేయిస్తున్న ముఠాల జాబితాలో ఇప్పటికే లావోస్ కూడా చేరింది. ఇప్పటివరకు ఈ తరహాలో కంబోడియా.. మయన్మార్ లాంటి దేశాల్లో ఇలాంటి ముఠాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు లావోస్ కూడా చేరింది. తాజాగా వారి చెర నుంచి తప్పించుకున్న హైదరాబాద్ యువకుడి కారణంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. తాను మోసపోయిన అంశంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ తరహా దారుణాలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.
హైదరాబాద్ లోని బడాబజార్ కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి రాపిడో బైక్ రైడర్ గా పని చేసేవాడు. అతనికి స్థానికంగా పరిచయం ఉన్న ఫాజిల్ ఖాన్ అనే వ్యక్తి లావోస్ లో ఛాట్ ప్రాసెస్ జాబ్ ఉందని ఈ ఏడాది ఏప్రిల్ లో చెప్పాడు. స్టార్టింగ్ జీతం రూ.35 వేలు ఇస్తారని పేర్కొంటూ ఇద్దరు ఏజెంట్లను పరిచయం చేశాడు. బైక్ రైడర్.. అతని స్నేహితుడు ఇద్దరు లావోస్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరి నుంచి సదరు ఏజెంట్లు రూ.30 వేలు తీసుకున్నారు. మే ఒకటిన సింగపూర్ నుంచి లావోస్ రాజధాని వియెంటియాస్ కు పంపారు. అక్కడి నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ తీసుకెళ్లారు.
వారిద్దరు అక్కడికి వెళ్లిన తర్వాత ఇతియోపియన్ ఏజెంట్ వచ్చి వారి పాస్ పోర్టులు తీసుకొని.. ఇంగ్ జిన్ ప్రాపర్టీ అనే కంపెనీకి వారిద్దరిని తీసుకెళ్లారు. అక్కడ వారిని పరీక్షించి.. పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. ఉండేందుకు రూం ఇచ్చారు. మొదటి రోజునే కొత్త ఐఫోన్ ఇచ్చారు. ఇన్ స్టా ఐడీలు క్రియేట్ చేశారు. అనంతరం వీరిద్దరికి అర్థమైన విషయం ఏమంటే..సదరు కంపెనీ తమ చేత సైబర్ నేరాలు చేయిస్తుందన్న విషయాన్ని గ్రహించారు. తమను కలిసిన ఏజెంట్లకు విషయం చెప్పి.. తమను ఇండియాకు తిరిగి పంపాలని వేడుకున్నారు.కానీ.. ఆ తర్వాత నుంచి వారు కనిపించటం మానేశారు.
అనంతరం అమెరికా, కెనడా, యూకేల్లోని ప్రవాస భారతీయులను పెట్టుబడులు పెట్టించేలా చేయటం.. హనీ ట్రాప్.. క్రిప్టో కరెన్సీ దందాల పేరుతో మోసగించే పనులు అప్పజెప్పేవారు. ఎన్ఆర్ఆఐ లకు ఫేస్ బుక్ ఖాతాలకు అందమైన అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్టులుపంపి.. వారితో రిలేషన్ పెట్టుకొని పెట్టుబడులు తెచ్చేలా చేయాలని చెప్పేవారు. ఎవరైనా వీరి ఉచ్చుకు చిక్కుకొని నమ్మితే.. సదరు ముఠాల వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకునే వారు.
సదరు ముఠాలు చెప్పినట్లు మోసాలు చేయకున్నా.. వారి ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయకున్నా.. కరెంట్ షాకులు ఇచ్చేవారు. 15 అంతస్తులను రోజుకు ఏడుసార్లు ఎక్కించేవారు. వీరు పెట్టే హింసను తట్టుకోలేక రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులు పారిపోయి, లావోస్ లోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించారు. దీంతో ధైర్యం తెచ్చుకున్న ఈ ఇద్దరు హైదరాబాద్ యువకులు లావోస్ లోని ఇండియన్ ఎంబసికీ తమ పరిస్థితిపై లేఖ రాశారు.
దీంతో ఆ దేశ లేబర్ అధికారుల నుంచి ఆదేశాలు రావటంతో వారికి తాము ఇచ్చిన ఫోన్లు తీసేసుకొని వారిని వెళ్లగొట్టారు. వారి నుంచి బయటపడి.. తొమ్మిది రోజుల తర్వాత ఎంబసీ అధికారులు పాస్ పోర్టులు సిద్ధం చేసిన ఇచ్చాక.. ఆ దేశం నుంచి థాయ్ లాండ్ చేరుకొని బస్సులో 12 గంటలు జర్నీ చేసి బ్యాంకాక్ కు వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో ఆగస్టు 24న హైదరాబాద్ కు చేరుకున్నారు. సిటీకి వచ్చిన తర్వాత తమను లావోస్ కు పంపిన ఫాజిల్ ఖాన్.. దావూద్ లపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం అన్నతనే నమ్మేసి వెళితే.. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయన్న మాట వినిపిస్తోంది.