Begin typing your search above and press return to search.

హంగులతో మెట్రో 2 దశ.. ఫ్లాట్ ఫాంలు.. కోచ్ లు.. అన్నీ సరికొత్తగా!

రేవంత్ సర్కారు ప్రాధాన్యత అంశాల్లో ఒకటి మెట్రో. నగరం నలువైపులా మెట్రోను పెద్ద ఎత్తున విస్తరించేందుకు భారీగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   30 Oct 2024 10:30 AM GMT
హంగులతో మెట్రో 2 దశ.. ఫ్లాట్ ఫాంలు.. కోచ్ లు.. అన్నీ సరికొత్తగా!
X

రేవంత్ సర్కారు ప్రాధాన్యత అంశాల్లో ఒకటి మెట్రో. నగరం నలువైపులా మెట్రోను పెద్ద ఎత్తున విస్తరించేందుకు భారీగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. 76.4కి.మీ. దూరాన్ని రూ.24,269 కోట్లతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన డీపీఆర్ కు ఓకే చెప్పేసి.. వడివడిగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. రెండో దశ మెట్రోకు సంబంధించి సరికొత్తగా సిద్ధం చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

మొదటి దశలో జరిగిన తప్పులు..లోపాల్ని సరిదిద్ది.. రెండో దశలో మరింత సౌకర్యవంతంగా.. భద్రతాపరమైన చర్యలతో పాటు.. అనవసరమైన ఖర్చును అదుపు చేసేలా ప్రాజెక్టును రూపొందించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పలు కీలక అంశాలు ఉన్నాయి. రెండో దశ మొదటి భాగంలో ఐదు కారిడార్లలో నిర్మించే ఈ ప్రాజెక్టులో మొదటి దశలో మాదిరే డ్రైవర్రహితంగా పూర్తి ఆటోమేటిక్ గా నడిపే నాలుగోతరం కోచ్ లను ఇందులో ప్రతిపాదించారు.

ప్రస్తుతం మూడో తరం కోచ్ లను వినియోగిస్తున్నారు. కొత్త కోచ్ లు మరింత అధునాతనంగా ఉండనున్నాయి. ఢిల్లీ.. చెన్నై మెట్రోల మాదిరి ప్రయాణికుల భద్రత కోసం తాజా ప్రాజెక్టులోని ఫ్లాట్ పాంపై స్క్రీన్ డోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో.. ట్రాక్ మీద ఎవరూ పడిపోకుండా ఉండేందుకు రక్షణగా ఉంటాయి. ఖర్చును తగ్గించుకోవటానికి యు గిడ్డర్ విధానంలో మెట్రో ట్రాక్ పనులు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలోని పలు చోట్ల ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

తొలి దశలో షాపుల కోసం భారీ స్థాయిలో స్టేషన్లను నిర్మించారు. రెండు అంతస్తుల్లో ..కొన్ని ప్రాంతాల్లో మూడు అంతస్తుల్లో షాపులు ఉండేలా డిజైన్ చేశారు. అదే సమయంలో చాలా స్టేషన్లకు పార్కింగ్ సౌకర్యం లేకపోవటం తెలిసిందే. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ప్రతి స్టేషన్ సమీపంలో ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేసి.. పార్కింగ్ కోసం కేటాయించనున్నారు. ప్రతి కారిడార్ కు ఒక డిపో ఉండేలా ప్రతిపాదించారు.

నాగోల్ - శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో మార్గానికి ఎయిర్ పోర్టులో డిపో రానుంది. రాయదుర్గం - కోకాపేట నియో పోలీసు మార్గంలో కోకాపేట లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో డిపో కోసం స్థలాలు పరిశీలిస్తున్నారు. ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట మార్గంలో ఫలక్ నుమాలో తొలిదశ మెట్రో డిపోకు కేటాయించిన భూమి ఉంది. మియాపూర్ - పటాన్ చెరు మార్గంలో ఒక డిపో రానుంది. ఎల్బీనగర్ - హయత్ నగర్ మార్గంలో ప్రభుత్వ స్థలాలు లేవని.. డిపో కోసం భూసేకరణగా కష్టంగా మారినట్లు చెబుతున్నారు. మొత్తంగా రెండో దశ మెట్రో అత్యాధునికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాలి.