Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో 2కు రూ.25వేల కోట్లు కావాలి

ఈ క్రమంలో 76.2కిలోమీటర్ల దూరానికి డీపీఆర్ లను సిద్ధం చేసేందుకు వీలుగా కసరత్తుకు ఆదేశాలు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 7:34 AM GMT
హైదరాబాద్ మెట్రో 2కు రూ.25వేల కోట్లు కావాలి
X

గడిచిన కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో 2 మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా తన కలల నగరమైన ఫోర్త్ సిటీతో పాటు.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు మెట్రో రైలు పరుగులు తీసేలా తన విజన్ ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో 76.2కిలోమీటర్ల దూరానికి డీపీఆర్ లను సిద్ధం చేసేందుకు వీలుగా కసరత్తుకు ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా ఫోర్త్ సిటీకి మినహాయించి.. మగిలిన ఐదురూట్లకు సంబంధించిన కారిడార్లకు వేర్వేరుగా నివేదికల్ని సిద్ధం చేశారు. తాజాగా ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో డీపీఆర్ ప్రక్రియ పూర్తైంది. మొత్తం 76,.2 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందన్న విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. దసరా నాటికి తమకు డీపీఆర్ లు ఇవ్వాలన్న ప్రభుత్వం చెప్పిన మాటకు తగ్గట్లే హైదరాబాద్ మెట్రో అధికారులు పూర్తిస్థాయి నివేదికల్ని వేర్వేరుగా సిద్ధం చేసి ఇచ్చేశారు.

తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర పట్టణాభివ్రద్ధి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డీపీఆర్ లను సిద్ధం చేయాలన్న ఆదేశాలతో వాటిని పూర్తి చేశారు. నిజానికి గతంలోనే నివేదికలు సిద్ధమైనప్పటికీ. కీలకమైన ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం డీపీఆర్ లను ఆపారు. వాటిని కూడా కలిపి తాజాగా కేంద్రానికి నివేదించారు. తాజాగా కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్.. హైదరాబాద్ మెట్రో 2కు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు మీద కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్న మాట వినిపిస్తోంది.

మెట్రో2ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులో కేంద్రం 15 శాతం వాటాను భరించాల్సి ఉన్నా.. రెండో దశలో 18 శాతం భరించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 30శాతం.. నాలుగు శాతం పీపీపీ పెట్టుబడులకు అవకాశం కల్పించి.. మిగిలిన 48 శాతానికి సంబంధించి జైకా లాంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాన్ని తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ప్రాజెక్టుపై రుణాలకు కేంద్రం పూచీకత్తుగా ఉంటుంది. త్వరలోనే ప్రధానమంత్రి మోడీని కలిసి.. మెట్రో2కు అవసరమైన అనుమతుల్ని వేగంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరనున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా సిద్ధం చేసిన హైదరాబాద్ 2 మెట్రో రూట్లు ఇవే..

నాగోల్ - శంషాబాద్ ఎయిర్ పోర్టు 36.6కి.మీ.

రాయదుర్గం - కోకాపేట నియోపొలిస్ 11.6కి.మీ.

ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట 7.5కి.మీ.

మియాపూర్ - పటాన్ చెర్వు 13.4కి.మీ.

ఎల్బీనగర్ -హయత్ నగర్ 7.1కి.మీ.