Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్ లలో అమ్మాయిలా చాట్.. బ్లాక్ మొయిల్ చేస్తూ మోసాలు

బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల రిద్ బేడీ గతంలో అమెరికాలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 3:57 AM GMT
డేటింగ్ యాప్ లలో అమ్మాయిలా చాట్.. బ్లాక్ మొయిల్ చేస్తూ మోసాలు
X

ఇప్పుడు చెప్పేటోడు మహా ముదురు. అలాంటి ఇలాంటోడు కాదు. డేటింగ్ యాప్ లలో అమ్మాయిలా చాట్ చేయటం.. ముగ్గులోకి లాగటం.. ఆపై బ్లాక్ మొయిల్ చేసి భారీగా డబ్బులు గుంజే ఈ ముదురు మగాడ్ని హైదరాబాద్ సైబర్ పోలీసులు పట్టేశారు. బెంగళూరులోని ఒక విలాసవంతమైన ప్రాంతంలో నెలకు రూ.75 వేలు అద్దె చెల్లిస్తూ.. ఖరీదైన కార్లలో జల్సాలు చేసే వీడి హైటెక్ యవ్వారాన్ని చూసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి. డేటింగ్ యాప్ ల ద్వారా అమెరికన్లను.. ప్రవాస భారతీయుల్ని మోసం చేసే ఘరానా కేటుగాడి గురించి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడించారు హైదరాబాద్ పోలీసులు.

బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల రిద్ బేడీ గతంలో అమెరికాలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఆరేళ్లు అక్కడే ఉండి బెంగళూరుకు వచ్చాడు. ఐటీ కంపెనీలో పని చేసే ఇతడికి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు. ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి జాబ్ పోగొట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు తప్పుడుదారి పడ్డాడు. డేటింగ్ యాప్ లలో అందమైన అమ్మాయిల ఫోటోలు సేకరించి.. నకిలీ ప్రొఫైళ్లు తయారు చేసేవాడు. ఆ పై పురుషులతో చాటింగ్ చేస్తుండేవాడు.

పక్కా ప్లాన్ తో.. భారతీయులను కాకుండా.. అమెరికన్లు.. అమెరికాలో ఉండే భారతీయుల్ని టార్గెట్ చేసేవాడు. అమ్మాయిలా నటిస్తూచాట్ చేసే ఇతగాడు.. తన అర్థనగ్న చిత్రాల్ని పంపి ముగ్గులోకి లాగి.. అవతలి వారి ప్రైవేటు చిత్రాలు సేకరించేవాడు. అవి చేతిలో పడిన తర్వాత నుంచి బెదిరింపులకు దిగేవాడు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని.. లేకుంటే ఫోటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగి.. అందినకాడికి డబ్బులు దోచేసేవాడు. ఇదే ధోరణిలో అమెరికాలోని ఒక భారతీయుడ్ని మోసం చేశాడు. అతడి నుంచి 1721 డాలర్లు వసూలు చేశాడు. అయినా బ్లాక్ మొయిల్ ఆపలేదు.

ఈ వేధింపుల వ్యవహారం హైదరాబాద్ లో ఉండే అతడి తండ్రికి తెలిసింది. సైబర్ పోలీసుల్ని సంప్రదించగా వారు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తో బెంగళూరు నుంచి మోసం జరుగుతున్న విషయాన్ని గుర్తించి అతడ్నిఅదుపులోకి తీసుకున్నారు. అతడి లైఫ్ స్టైల్ చూసిన పోలీసులే అవాక్కు అయ్యే పరిస్థితి. ఖరీదైన విల్లాలో ఉండటం.. పగలంతా నిద్రపోవటం.. రాత్రిళ్లు మోసాలు చేయటం ఇతనికి అలవాటు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నకిలీ సిమ్ కార్డులు వాడే వాడని గుర్తించారు. అయినప్పటికి పట్టుబడ్డాడు. ఈ మొత్తం ఉదంతం సారాంశం ఏమంటే.. తప్పుడు పనులు చేసేటోళ్లు ఎప్పటికైనా దొరికేస్తారు. తస్మాత్ జాగ్రత్త.