Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ పై కేసు నమోదు... సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!

అవును... తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు... థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్ పైనా కేసులు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 4:14 AM GMT
అల్లు అర్జున్  పై  కేసు నమోదు... సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!
X

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప-2" తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చి ఫుల్ సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రీ సేల్ బుక్కింగ్స్ లోనూ, కలెక్షన్స్ పరంగా ఓవర్సీస్ లోనూ టాప్ లో కొనసాగుతోందని అంటున్నారు. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచానా వేశాయి.

మరోపక్క బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులతో పాటు ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ రావడం.. దానికి సంబంధించి ముందస్తు సమాచారం లేదని అంటుండటం.. జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు... థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్ పైనా కేసులు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ రావడం.. ఆయన సెక్యూరిటీ సిబ్బంది తోయడం వల్లే తోపులాట జరిగినట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షంశ్ యాదవ్ మాట్లాడుతూ... బుధవారం రాత్రి 9:40 సమయంలో పుష్ప-2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్ లో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని.. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారని తమకు సమాచారం లేదని తెలిపారు.

ఈ విషయంలో కనీసం సినిమా థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఎలాంటి సమాచారం అందించలేదని.. ఎలాంటి ముందస్తు చర్యలూ తీసుకోలేదని అన్నారు. పబ్లిక్ ను కంట్రోల్ చేయడం కోసం ఎటువంటీ ప్రైవేటు సెక్యూరీటీనీ ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.

బుధవారం రాత్రి తన వ్యక్తిగత భద్రతా సిబ్బంధితో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారని.. ఆ సమయంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని.. అయితే అప్పటికే థియేటర్ లోపలా, బయటా కిక్కిరిసిపోయి ఉందని అన్నారు. అల్లు అర్జున్ ఎంట్రీతో తోపులాట చోటు చేసుకుందని అన్నారు.

ఆ సమయంలోనే... రేవతి, ఆమె కుమారుడితో ఆ ప్రాంతంలోనే ఉన్నారని.. అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరి ఆడలేదని.. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగి, ఆమె కుమారుడికి సీపీఆర్ చేశారని.. అనంతరం దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు.

అయితే... రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అన్నారు. ఈ సమయంలో ఆమె కుమారుడు శ్రీతేజ ను మరో ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. 105, 118 (1) రెడ్ విత్ 3(5) బీ.ఎన్.ఎస్. కింద కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.

స్పందించిన అల్లు అర్జున్ టీమ్:

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై డీసీపీ ప్రెస్ మీట్ కంటే ముందే అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఈ సందర్భంగా... జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమని.. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి, అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది.

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు!:

సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ)లో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

జరిగిన దారుణానికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతోపాటు మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు.

పోలీసులు పర్మిషన్లు ఇవ్వొద్దు - విద్యార్థి సంఘాలు!:

బెనిఫిట్ షోలు రద్దు చేయాలని, మృతురాలు రేవతి కుటుంబానికి కోటి రూపాయల అపరిహారం చెల్లించాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ), డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. గాయపడిన శ్రీతేజ్ కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని పోలీసులను కోరారు!