Begin typing your search above and press return to search.

సీఎం మీద ప్రెస్ మీట్ సరే.. హైదరాబాద్ సీపీ మీద ప్రెస్ మీట్ ఎప్పుడు బన్నీ?

జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పరామర్శల కోసం పోటెత్తిన వైనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:51 AM GMT
సీఎం మీద ప్రెస్ మీట్ సరే.. హైదరాబాద్ సీపీ మీద ప్రెస్ మీట్ ఎప్పుడు బన్నీ?
X

సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట.. . ఒక నిండు ప్రాణం పోవటం.. ఇదే ఎపిసోడ్ లో మరో బాలుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వేళ.. మజ్లిస్ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ తీరు మీదా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదా నిప్పులు చెరగటం.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పరామర్శల కోసం పోటెత్తిన వైనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఒక రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రముఖ సినీ నటుడిని ఉద్దేశించి.. అతడు చేసిన తప్పుల గురించి అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారిగా చెప్పాలి. అలాంటి వేళ.. ఈ మొత్తం ఇష్యూకు కేంద్రంగా ఉన్న అల్లు అర్జున్ కాసింత ఆలోచించాలి కదా? ఒకవేళ.. అతడికి ఆలోచన కంటే ఆవేశమే ఎక్కువగా ఉందని అనుకుందాం. అలాంటప్పుడు అల్లు అరవింద్ లాంటి వ్యక్తి సర్ది చెప్పాలి కదా? జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్న ఆయన.. సంధ్య థియేటర్ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తునప్పుడు.. ఇష్యూ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు వీలుగా ఏం చేయాలో అది చేయకుండా.. మంట మరింత పెరిగే చర్యలకు ఎందుకు ఓకే చెబుతున్నారు? అన్నది మరో ప్రశ్న.

అల్లు అర్జున్ స్వశక్తితో ఎదగలేదు. అతడి ఎంట్రీనే.. అల్లు అరవింద్ కొడుకుగా.. మెగాస్టార్ మేనల్లుడన్న ట్యాగ్ తోనే తెర మీదకు వచ్చారు. అలాంటప్పుడు ఆ ట్యాగ్ కు ఉన్న విలువ.. మర్యాదను కాపాడాల్సిన బరువు బాధ్యతలు బన్నీ మీద ఉండవా? అన్నది ప్రశ్న. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ.. సీఎం చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ మాదిరి ఇవ్వటానికి ఇదేమైనా సినిమానా? సీన్ తర్వాత సీన్ జరగటానికి. ఇది నిజజీవితమన్న విషయాన్ని ఎలా మరచిపోయారు? ఒకవేళ అల్లు అర్జున్ మర్చిపోవచ్చు. కానీ.. గుర్తు చేయాల్సిన అవసరం అల్లు అరవింద్ మీద ఉండాలి కదా?

తనను తప్పుగా చూపిస్తున్నారని.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని.. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నాల్ని తాను ఖండిస్తున్నట్లుగా చెప్పిన అల్లు అర్జున్.. ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ అండ్ కో విడుదల చేసిన వీడియోకు ఏమని బదులు ఇస్తారు? అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మూడు గంటల వ్యవధికే రాత్రి 7 గంటలకు ప్రెస్ మీట్ ఉందని మీడియాకు మెసేజ్ పంపించిన అల్లు అర్జున్ టీం.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ విడుదల చేసిన వీడియో తర్వాత ఎందుకు కామ్ గా ఉన్నారు? దానికి సమాధానం చెప్పాలి కదా? సీన్ టు సీన్.. ఆ రోజు అసలేం జరిగిందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన వీడియోకు బదులివ్వాల్సిన నైతిక బాధ్యత అల్లు అర్జున్ మీద లేదా?