హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో రియల్ భూమ్ ఢమాల్?
సొంతిల్లు ఉండాలని అందరం కలలు కంటూ ఉంటాం. ఆ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంటాం.
By: Tupaki Desk | 3 Sep 2024 4:30 PM GMTసొంతిల్లు ఉండాలని అందరం కలలు కంటూ ఉంటాం. ఆ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంటాం. చివరకు ఎంతో కొంత కూడబెట్టి.. కొంత బ్యాంకు లోన్ తీసుకుని కొనుగోలు చేద్దామన్నా హైదరాబాద్ నగరంలో అందనంత ఎత్తులో ధరలు ఉన్నాయి. సిటీ పెరుగుతున్నట్లుగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇక్కడ భారీ స్థాయిలో వృద్ధి చెందింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండుతో ధరలు ఆకాశాన్ని తాకాయి. దాంతో ఇక సామాన్య ప్రజలైతే సిటీలో కానీ, సిటీ చుట్టు పక్కల కానీ ఇల్లు, స్థలం ఏదీ కొనే పరిస్థితి లేదు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై హైడ్రా డ్రైవ్ నడుస్తోంది. ఎక్కడికక్కడ నగరంలో, నగర పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో నేలమట్టం చేయగా.. సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వేషన్ సైతం కూల్చడంతో హైడ్రా మరింత హైలైట్ అయింది. ఇంకా చాలా మంది ప్రముఖులకు సంబంధించిన ఫామ్‌హౌస్‌లు సైతం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వాటిని కూడా కూల్చేందుకు హైడ్రా సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది.
కట్ చేస్తే.. ఇప్పుడు ఈ కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండడంతో సిటీ పరిధిలో రియల్ వ్యాపారం దెబ్బకు పడిపోయింది. అంతేకాదు.. పలుచోట్ల ధరలు సైతం భారీగా తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంటోంది.
అయితే.. జన్వాడలోని కేటీఆర్‌కు చెందినదని చెప్తున్న ఫామ్‌హౌస్ పరిధిలోని భూముల ధరలు కూడా ఊహించని స్థాయికి పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఫామ్‌హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానిని కూడా హైడ్రా కూల్చివేస్తుందని ప్రచారం జరిగింది. చివరకు అది 111 జీవో పరిధిలో ఉందని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. కానీ.. ఆ తీవ్రత మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఓ కుదుపు కుదిపేసింది. జన్వాడ ఫామ్‌హౌస్ పరిధిలోని భూముల రేట్లు పడిపోవడమే ఇందుకు నిదర్శనం.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏరియాలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎకరాలకు ఏకంగా రూ.25 కోట్లకు చేరింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 111ని ఎత్తివేయబోతున్నట్లుగానూ సంకేతాలు ఇచ్చింది. దాంతో డిమాండ్ మరింత పెరిగింది. అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ అధికారం చేపట్టింది. దాంతో ఇప్పుడు జీవో 111 ఎత్తివేత అంశం ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆ జీవో రద్దు కాదని ప్రభుత్వం పెద్దలు స్పష్టం చేశారు. జీవో తొలగించకపోవడం, హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా తగ్గాయి. ఎకరాకు రూ.25 కోట్ల వరకు ఉంటే ఇప్పుడు రూ.5 కోట్లు మాత్రమే పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది రియల్టర్లు 5 కోట్లకు ఆఫర్ చేస్తున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మొత్తానికి హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం కూడా మెల్లమెల్లగా దిగివస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.