డేంజర్ రైడ్: ముగ్గురి ప్రాణాలు తీసిన ట్రిపుల్ రైడింగ్
హైదరాబాద్ మహానగరంలోని ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు దుర్మరణం పాలయ్యారు.
By: Tupaki Desk | 28 Jan 2025 6:51 AM GMTఈ తెల్లవారుజామున (మంగళవారం) పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలోని ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు దుర్మరణం పాలయ్యారు. రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్ద చోటు చేసుకున్నఈ ప్రమాదం షాక్ కు గురి చేసేలా మారింది. దీనికి కారణం మోపెడ్ మీద ట్రిపుల్ రైడింగ్ చేయటం.. ఫ్లైఓవర్ మీద ఓవర్ స్పీడ్ తో వెళుతున్న వారు అదుపు తప్పారు. ఇదే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళుతున్న వీరు.. శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టారు. దీంతో వీరు ప్రమాణిస్తున్న వాహనం డివైడర్ వైపుకు దూసుకెళ్లింది. వాహనంగా వేగంగా.. బలంగా తాకటంతో వారు బండి మీద నుంచి పడ్డారు.
దీంతో.. బండి మీద ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్ర గాయాల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన ముగ్గురు బహదూర్ పురాకు చెందిన మైనర్లుగా గుర్తించారు. మితిమీరిన వేగంతో వాహనాన్ని అదుపు చేయటంలో ఫెయిల్ కావటం ఈ తీవ్ర ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
తెల్లవారుజాము ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం నిర్ఘాంతపోయేలా చేసింది. మైనర్లకు వాహనాల్ని ఇవ్వకూడదని.. ఒకవేళ ఇచ్చిన పక్షంలో వాహన యజమానిపైనా కేసు నమోదు చేయటం.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నప్పటికి.. హైదరాబాద్ మహానగరంలో తరచూ ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోవటం గమనార్హం. మరణించిన వారికి సంబంధించిన వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఏ పని మీద ఇంత పొద్దున్నే బయటకు వచ్చారన్నది బయటకు రావాల్సి ఉంది.