Begin typing your search above and press return to search.

బర్త్ డే నాడు పేలిన సొంత తుపాకీ... యూఎస్ లో హైదరాబాదీ మృతి!

అమెరికాలో పలు కారణాల కారణంగా మృతి చెందుతున్న భారతీయుల జాబితాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 4:24 AM GMT
బర్త్  డే నాడు పేలిన సొంత తుపాకీ... యూఎస్  లో హైదరాబాదీ మృతి!
X

కారణం ఏదైనా.. కారకులు మరెవరైనా.. ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసమని విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలు వారిని కన్నవారికి తీవ్ర కడుపుకోతను మిగులుస్తున్నాయి. ఈ క్రమంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు.

అవును... అమెరికాలో పలు కారణాల కారణంగా మృతి చెందుతున్న భారతీయుల జాబితాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు. తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ వ్యవహారం ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది!

వివరాళ్లోకి వెళ్తే... ఉప్పల్ లోని ధర్మపురి కాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతుల ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి (23) గత ఏడాది డిసెంబర్ లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో... జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్నారు.

ఈ క్రమంలో... ఈ నెల 13న స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నరు. అయితే.. అదే రోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ శబ్ధం వచ్చింది. దీంతో.. స్నేహితులు వెళ్లి చూసేసరికి అతడి ప్రాణం పోయింది. తూటా నేరుగా ఛాతి లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఆర్యన్ మృతి చెందారు.

దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా స్పందించిన ఆర్యన్ తండ్రి... తుపాకీ శుభ్రం చేసే సమయంలో మిస్ ఫైర్ అయ్యి ఆర్యన్ మృతి చెంది ఉంటాడని అభిప్రాయపడ్డారు. అతను ఈ ఏడాది ఆగస్టు లోనే హంటింగ్ గన్ లైసెన్స్ తీసుకున్నాడని.. దీని కోసం ఓ పరీక్ష కూడా రాశాడని అన్నారు.