Begin typing your search above and press return to search.

సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన జనం.. ఖాళీగా దర్శనమిస్తున్న రోడ్లు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో గడిచిన రెండు మూడు రోజుల నుంచి నగరవాసులు తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళుతున్నారు.

By:  Tupaki Desk   |   12 Jan 2025 5:51 AM GMT
సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన జనం.. ఖాళీగా దర్శనమిస్తున్న రోడ్లు
X

నిత్యం వాహనాల రద్దీతో కలకలలాడుతూ కనిపించే హైదరాబాద్ రోడ్లన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ట్రాఫిక్ సమస్యతో గంటల తరబడి సిగ్నల్ పాయింట్ల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నుంచి.. క్షణాల్లోనే సుదూర ప్రాంతాలకు నగర పరిధిలో ప్రయాణించే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. దీనికి కారణం సంక్రాంతి పండగ నేపథ్యంలో నగర ప్రజలంతా తమ స్వస్థలాలకు వెళ్లడమే.

గడిచిన మూడు రోజుల నుంచి హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్షలాదిమంది నగరవాసులు సొంత ఊర్లకు ప్రయాణమై వెళ్లారు. దీంతో నిత్యం వాహనాల రాకపోకలు, నగరవాసుల రద్దీతో కిటకిటలాడుతూ కనిపించిన నగర పరిధిలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ రోడ్లన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసి కనిపిస్తాయి. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లాలి అంటే ఎంతో సమయం పడుతుంది.

ఇంటి దగ్గర నుంచి తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులకు గంటల సమయం పట్టేది. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సమస్యను చూసి ఎంతోమంది తలలు కొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఏడాది మొత్తం చూసిన హైదరాబాద్ నగరాన్ని.. సంక్రాంతి పండుగ నాలుగు రోజులు చూస్తే భిన్నంగా కనిపిస్తుంది. కనీసం కాలు పెట్టేందుకు కూడా అవకాశం లేని రోడ్లు ఈ నాలుగు రోజులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే నగరవాసులు తమ సొంతూర్లకు వెళ్లడంతో ప్రధాన కూడళ్లు, జంక్షన్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. నగర పరిధిలోని ప్రధాన ప్రాంతాలైన పంజాగుట్ట, బంజారాహిల్స్, గచ్చిబౌలితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది నగరవాసులు తమ సొంత ఊర్లకు వెళ్లడంతో రోడ్లు ఖాళీగా మారాయి.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో గడిచిన రెండు మూడు రోజుల నుంచి నగరవాసులు తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో ఇప్పటికే రైల్వేస్టేషన్లో, బస్టాండ్లు ప్రయాణాలు చేసే వారితో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రకు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. అనేకచోట్ల నగర శివార్లలో ట్రాఫిక్ కు అంతరాయం కూడా ఏర్పడుతోంది. ప్రస్తుతం సంక్రాంతికి వెళుతున్న నగరవాసులంతా వారం రోజులు తరువాత అంటే వచ్చే వారం శని, ఆదివారాల్లో తిరిగి హైదరాబాద్ నగరానికి బయలుదేరి వస్తారు. అప్పటి వరకు నగరం అంతా ఖాళీగా కాలుష్యరహితంగా మారనుంది.

ఈ సెలవు దినాల్లో హైదరాబాద్‌లో ఉండే యువకులు అనేక ప్రధాన రహదారుల క్రికెట్ ఆడుతూ కూడా కనిపిస్తుంటారు. ఇవన్నీ చూసేందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి. వచ్చేవారం శని, ఆదివారాల నుంచి సొంత ఊర్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికులతో మళ్లీ హైదరాబాద్ వచ్చే రోడ్లు కిక్కిరిసి కనిపిస్తాయి. ఏదిఏమైనా సంక్రాంతి పండుగ పుణ్యమా అని నిత్యం గందరగోళంగా, ఉరుకుల పరుగులతో, కాలుష్య కారకంగా ఉండే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడంతోపాటు కాలుష్య రహిత నగరంగా మారుతుందని పలువురు పేర్కొంటున్నారు.