పాతబస్తీలో యువకుల అరాచకం.. కిలోమీటర్ మేర వాహనాలను ఢీకొడుతూ..!
మద్యం తాగి వాహనాలు నడుపుతూ... అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే బ్యాచ్ రోజు రోజుకీ శృతిమించిపోతున్నారు
By: Tupaki Desk | 14 Aug 2023 6:16 AM GMTమద్యం తాగి వాహనాలు నడుపుతూ... అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే బ్యాచ్ రోజు రోజుకీ శృతిమించిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వైజాగ్ లో ఇలానే తాగి సుమారు గంటకు 150 కి.మీ. వేగంతో వాహనాలు నడిపి భారీ ప్రమాదానికి కారణమైన సంఘటన గురించి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా పాతబస్తీలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
అవును... హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ ఏరియాలో ఓ కారు బీభత్సం చేసింది. ఆ సమయంలో కారు నడిపిన యువకుడు, కారులో ఉన్న వారు సైతం మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఈ మైకంలో కన్నూమిన్నూ కానకుండా.. దారిలో కనిపించిన వాహనాలను సుమారు కిలోమీటర్ మేర ఢీకొట్టుకుంటూ పోయారు.
ఈ సమయంలో యువకులను ఎలాగైనా పట్టుకునేందుకు స్థానికులంతా ఏకమయ్యారు. కారును వెంటాడి.. వెంబడించారు. అయినా కూడా కారును ఆపకుండా పోయేందుకు ప్రయత్నించారు మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్న ఆ యువకులు. దీంతో పదుల సంఖ్యలో గుమిగూడిన స్థానికులు.. కారును కదలకుండా చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చారు.
ఈ సమయంలో కారు నుంచి దిగిన యువకులు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు! దీంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం వారివెంట పరుగెత్తి యువకులను పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ది చేశారని తెలుస్తోంది. ఇదేసమయంలో వారు ప్రయాణించిన కారును ఫల్టీలు కొట్టించి ధ్వంసం చేశారు. కారులో ఉన్న మద్యం సీసాలను పగులగొట్టారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అటు ఎంఐఎం నేతలు, ఇటు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నలుగరు యువకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కారు బీభత్సానికి పదిమంది గాయపడగా.. ఆరుగురికి తీవ్రగయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది.