Begin typing your search above and press return to search.

హైదరాబాద్ డ్రంక్ & డ్రైవ్ కేసుల్లో సరికొత్త రికార్డ్!

అవును... హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ లను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎవరి పనులో వారు ఉంటున్నారు!!

By:  Tupaki Desk   |   29 July 2024 12:52 PM GMT
హైదరాబాద్  డ్రంక్  & డ్రైవ్  కేసుల్లో సరికొత్త రికార్డ్!
X

'ఆల్కహాల్ సేవించి వాహనం నడపరాదు' అని ఎక్కడ బడితే అక్కడ ప్రకటనలు కనిపిస్తుంటాయి. అయినప్పటికీ తాగి వాహనం నడిపే విషయంలో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్నెన్ని ఘోరాలు వెలుగులోకి వస్తున్నా పలువురు మందుబాబులు మాత్రం మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో తమ ఆలోచనను, ఆచరణను మార్చుకోవడం లేదు!

ప్రధానంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో వీకెండ్ వచ్చిందంటే మందుబాబులు చెలరేగిపోతున్నారని అంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపినా పోలీసులకు దొరకములే అన్న ధైర్యమే తప్ప, దానివల్ల తమ జీవితాలే ప్రమాదంలో పడుతున్నాయని మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఈ సమయంలో శనివారం డ్రంక్&డ్రైవ్ లో రికార్డ్ క్రియేట్ అయ్యింది.

అవును... హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ లను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎవరి పనులో వారు ఉంటున్నారు!! దీంతో... సిటీ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత నేరాల్లో పలువురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు!

ఇదే సమయంలో వీకెండ్స్ లో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారి విషయంలోనూ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు! ఈ నేపథ్యంలో... గత శనివారమే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 298 మంది పట్టుబడ్డారు. వీరిలో 70 మందికి 2 నుంచి 8 రోజుల జైలు శిక్ష పడినట్లు తెలుస్తోంది.

ఇక గత 15 రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మొత్తం 2,483 మంది పట్టుకున్నారు. ఇదే క్రమంలో... గత 15 రోజుల్లో వివిద కోర్టుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై 1,543 ఛార్జ్ షీట్లు దాఖలు చేయబడ్డాయని అంటున్నారు. ఇందులో 158 మంది వ్యక్తులను అరెస్ట్ చేయగా.. 12 మంది లైసెన్సులను 3 - 6 నెలలపాటు రద్దు చేశారు.

ఇలా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినవారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. గత రెండు వారాల్లో అరెస్టైన 2,483 మందిలో 2,034 మంది ద్విచక్ర వాహనదారులేనని అంటున్నారు! కాగా... మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా.. లేదా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు!