Begin typing your search above and press return to search.

హైదరాబాద్ అంటేనే తెలియని భావోద్వేగం

చిత్రమేంటి అంటే హైదరాబాద్ ని తమ జీవిత కాలంలో వెళ్లని వారు ఉన్నారు. కానీ మనసులో మాత్రం అది కూడా మా వూరే అన్న బలమైన భావం వారిలో ఉంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 2:30 PM GMT
హైదరాబాద్ అంటేనే తెలియని భావోద్వేగం
X

హైదరాబాద్ అన్నది ఆరు దశాబ్దాల పాటు తెలుగు వారి రాజధాని. ఆంధ్రులు అంతా తమ గుండెలలో పెట్టుకున్న రాజధాని. ఎంతలా అంటే మన పాఠ్య పుస్తకాల నుంచి సినిమాల్లో పాటల దాకా భాగ్యనగరం మనదే అంటూ చెప్పేవారు. అలా హృదయాంతరాలలో హైదరాబాద్ తో ఎక్కడో శ్రీకాకుళం లో ఉన్న వారికి సైతం విడదీయని బంధం ఏర్పడింది.

చిత్రమేంటి అంటే హైదరాబాద్ ని తమ జీవిత కాలంలో వెళ్లని వారు ఉన్నారు. కానీ మనసులో మాత్రం అది కూడా మా వూరే అన్న బలమైన భావం వారిలో ఉంది. హైదరాబాద్ ని సినిమాల్లో చూసి సంతోషిస్తూ ఒక తరం కాలం చేసింది. ఇక తరువాత తరువాత ఉద్యోగం ఉపాధి కోసం వ్యాపారాల కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. వీరందరికీ భౌతికపరమైన బంధం కూడా తోడు అయింది.

వారంతా మన రాజధాని అనుకుంటూ గర్వంగా బతికేవారు. అలా హైదరాబాద్ అనే ఆస్తిలో తామూ భాగమే అన్న అభిప్రాయంతో ఉండేవారు. కానీ 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ లో జరిగిన ఒక చారిత్రాత్మక నిర్ణయంతో ఉమ్మడి ఏపీ రెండుగా చీలిపోయింది. అపాయింట్ డే గా జూన్ 2 ని నాడు నిర్ణయించారు. అంటే ఆనాటి నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పాటు అవుతాయని పేర్కొన్నారు.

అదే సమయంలో హైదరాబాద్ తో ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాన్ని దృష్టిలో ఉంచుకుని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేస్తూ చట్టంలో పేర్కొన్నారు. దాని మీద రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అలా పదేళ్ల కాలం 2024 జూన్ 2తో పూర్తి అవుతోంది. అంటే హైదారాబాద్ తో దశాబ్దాల అద్భుతమైన బంధానికి పూర్తిగా తెర పడినట్లే అంటున్నారు.

ఏపీ ఈ పదేళ్ళలో ఏమి సాధించింది అంటే రాజధాని నిర్మాణం అయితె చేసుకోలేకపోయింది. ఇది నిజంగా రాజకీయ వైఫల్యంగానే చూడాలి. రెండు ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో వచ్చాయి. రెండు రకాలుగా రాజధాని గురించి ఆలోచన చేశాయి. చివరికి అది న్యాయపరమైన చిక్కుల్లో పడిపోయింది. దాంతో ఏపీకి రాజధాని అన్నది ఈ రోజుకు టెక్నికల్ గా లేదు అనే అంటున్నారు.

ఇదొక ఇబ్బంది అయితే ఎవరేమనుకున్నా హైదరాబాద్ తోనే బంధం అనుకునే వారికి జూన్ 2 డేట్ బంధం తెంచేస్తోంది. ఇదే ఇదే మన భాగ్యనగరం మొక్కోటి ప్రజల రాజధాని నగరం అని పాడుకున్న పాటలు చరిత్రలో కలిసిపోతున్నాయి బాలల్లారా రారండి మన రాజధానిని చూడండి అని పాడుకున్నదీ ఇపుడు నిన్నటి జ్ఞాపకం అవుతోంది.

ఆంధ్రులకు ఇది ఒక పాపంగా శాపంగా మారింది. నిజం చెప్పాలంటే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి 1953లో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం వేరు పడింది. అపుడు కూడా మద్రాస్ తో బంధాన్ని తెంచేసుకున్నామన్న బాధ ఉన్నా అది కొంతవరకే అయింది. కానీ హైదరాబాద్ తో అలా కాదు 1956తో ఏర్పడిన బంధం ఇది. ఆరు దశాబ్దాల సుదీర్ఘమైన ప్రయాణం ఇది.

దాని కంటే ముందు కూడా హైదరాబాద్ తో వందల ఏళ్ల వెనక్కు వెళ్తే ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. అంతా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అటూ ఇటూ చుట్టరికాలు ఉన్నాయి. అంతా ఒక్కటి అన్న భావన మదిలో పదిలంగా ఉంది. అలాంటి చోట ఇపుడు కాదు మీరు హైదరాబాద్ మాది అని అంటూంటే మాత్రం మనసు అంతా ఎక్కడో బలంగా మూలుగుతుంది.

మరో అయిదేళ్ళ పాటు హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ గా చేయాలని ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు సరికొత్తగా జారీ చేయాలని కోరుతున్నారు. అయితే దాని వల్ల ఏమి ఒరుగుతుంది అన్న వారూ ఉన్నారు. ఎప్పటికైనా వాస్తవం కఠినంగానే ఉంటుంది. హైదరాబాద్ తో కాకుండా ఏపీలోనే మంచి రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది.

అదే విధంగా హైదరాబాద్ తో మానసికమైన బంధాన్ని కొనసాగించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. దానిని ఎవరూ తెంచలేరు. ఆ బంధం అలా మరిన్ని తరాలు కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ విషయంలో ఆంధ్రులు ఒక వాస్తవిక దృక్పధంతోనే ఇక ముందు అడుగులు వేయాల్సి ఉంటుంది అన్నది అందరి మాట. హైదరాబాద్ కి అయితే అందరూ కావాలి. ఆ కల్చర్ గొప్పది. అందులో ఆంధ్రులు కూడా ఉంటారు. అలా ఈ విడదీయరని బంధాన్ని మాత్రం పెనవేసుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందే.