భాగ్యనగరంలో బాబుకు షాకిచ్చేలా ఫ్లెక్సీలు
చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ లో ఇంకా పదిలంగా ఉంది అనడానికి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 5 July 2024 5:31 PM GMTటీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు హైదరాబాద్ లొ గ్రాండ్ వెల్ కం లభిస్తోంది. ఆయన అరెస్ట్ అయినపుడు కూడా హైదరాబాద్ లోనే నిరసనలు చేస్తూ రీ సౌండ్ చేసారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ లో ఇంకా పదిలంగా ఉంది అనడానికి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ నెల 6న ప్రజా భవన్ లో ఏపీ తెలంగాణా సీఎం ల తొలి భేటీ జరగబోతోంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూంటే చంద్రబాబుకు గ్రాండ్ లెవెల్ లో వెల్ కం చెబుతూ ఫ్లెక్సీలు బ్యానర్లు హైదరాబాద్ అంతటా ఏర్పాటు కావడం విశేషం.
ఎక్కడ చూసినా బాబు ఫ్లెక్సీలు బ్యానర్లతో భాగ్యనగరం హోరెత్తుతోంది. మరో వైపు చూస్తే చంద్రబాబు స్వాగత ఫ్లెక్సీని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ పోలీసులే కడుతున్నారు అని ప్రచారం సాగింది. అయితే పోలీసు శాఖ దానిని ఖండించింది. ఫ్లెక్సీల వద్ద ప్రమాదాలు జరుగుతాయని భావించి దానిని పక్కకు పెట్టే ప్రయత్నం చేశామని తప్పించి తాము కట్టడం లేదని వివరణ ఇచ్చింది.
అయితే ఏపీ సీఎం గా చంద్రబాబు హైదరాబాద్ లో పాల్గొనబోయే తొలి అధికారిక కార్యక్రమం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఆయనకు ఎన్నడూ లేని విధంగా స్వాగతం లభిస్తోంది. అంతే కాదు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంకో వైపు చూస్తే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కి చేరుకున్న చంద్రబాబుకు బేగం పేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఒక వైపు వర్షం కురుస్తున్నా పెద్ద సంఖ్యలో తెలంగాణా టీడీపీ కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు ఏపీ సీఎం అయిన తరువాత తొలిసారి హైదారాబాద్ వచ్చారని తెలంగాణా టీడీపీ భారీ స్వాగత ఏర్పాట్లను చేసింది. అంతే కాదు అనూహ్యంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో బాబు ఉప్పొంగిపోయారు.
దాంతో చంద్రబాబు వాహనం ఎక్కి అక్కడ నుంచి అభిమానులకు పార్టీ వాదులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బేగం పేట నుంచి బాబు నివాసం ఉండే జూబ్లీ హిల్స్ దాకా ఈ భారీ ర్యాలీ సాగడం విశేషం. మొత్తం మీద చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో హైదరాబాద్ లో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణా టీడీపీ రీ యాక్టివ్ అవుతోంది. ఈ పరిణామాలు తెలంగాణాలో పార్టీకి శుభ సూచకమంగా చెబుతున్నారు.