Begin typing your search above and press return to search.

ఇదే జరిగితే.. ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌!

తాజాగా హైదరాబాద్‌ ప్రపంచ నగరాల సరసన చేర్చడానికి కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 7:55 AM GMT
ఇదే జరిగితే.. ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌!
X

హైదరాబాద్‌ దేశంలోనే ఐదో అతిపెద్ద నగరం. ఓవైపు ఫార్మా హబ్‌ గా ఇంకోవైపు ఐటీ హబ్‌ గా హైదరాబాద్‌ నగరానికి పేరుంది. ఇక మెడికల్‌ టూరిజానికి సంబంధించి దేశంలోనే నంబర్‌ వన్‌ నగరంగా హైదరాబాద్‌ నిలుస్తోంది. ఎన్నో ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేశాయి. దేశానికి మధ్యలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటం, సులువుగా దేశంలో ఏమూలకైనా వెళ్లిపోవడానికి రైల్వే, రోడ్డు రవాణా సదుపాయాలు ఉండటం హైదరాబాద్‌ ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

రామోజీ ఫిల్మ్‌ సిటీ, గోల్కొండ కోట, చార్మినార్‌ తదితర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చేవారు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలపడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటికే రింగ్‌ రోడ్డు, మెట్రో రైల్‌ విస్తరణతోపాటు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది.

తాజాగా హైదరాబాద్‌ ప్రపంచ నగరాల సరసన చేర్చడానికి కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్‌ తరహాలో హైదరాబాద్‌ ను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.

కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ సంస్థ ఆసియా – పసిఫిక్‌ సీఈవో మ్యాథ్యూ భౌ తన ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్‌ ను కలిశారు. ఈ సందర్భంగా దేశంలోనే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ సీఈవో మ్యాథ్యూ తెలిపారు.

ముఖ్యంగా గత ఆరు నెలల్లో రియల్టీ, లీజింగ్, ఆఫీస్‌ స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్‌ స్పేస్‌ రంగాల్లో హైదరాబాద్‌ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందని మ్యాథ్యూ వెల్లడించారు.

ఈ సందర్భంగా తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని సీఎం రేవంత్‌ తెలిపారు. ప్రపంచ నగరాల స్థాయిలో హైదరాబాద్‌ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. తమ ప్రభుత్వం మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), మెట్రో రైలు మార్గం విస్తరణ పనులు మొదలుపెట్టిందన్నారు. వీటితో హైదరాబాద్‌ మరింత అద్భుతంగా తయారవుతుందని రేవంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి తాము విడుదల చేసే నివేదిక జూలై చివరలో విడుదలవుతుందని కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ప్రతినిధి బృందం తెలిపింది.

అమెరికాలో హడ్సన్‌ నదీ తీరంలో ఉన్న న్యూయార్క్‌ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది. అలాగే మూసీ నదీ తీరాన ఉన్న హైదరాబాద్‌ ను కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తే ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందనే అంచనాలున్నాయి.