Begin typing your search above and press return to search.

మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను రెండుగా విభజించిన సందర్భంగా హైదరాబాద్‌ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 March 2024 5:41 AM GMT
మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను రెండుగా విభజించిన సందర్భంగా హైదరాబాద్‌ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పునర్విభజన చట్టంలో ఈ అంశాన్ని అధికారికంగా చేర్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను చేర్చి ఈ ఏడాది జూన్‌ 2కి పదేళ్లు పూర్తవుతుంది. అంటే ఇప్పటికీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంటే హైదరాబాదే.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కు జూన్‌ 2తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా.. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ పిల్‌ ను దాఖలు చేశారు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను ప్రకటించిన పదేళ్ల గడువు జూన్‌ 2తో ముగుస్తున్నా.. ఏపీ విభజన చట్టం–2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ఇదే అంశాన్ని పేర్కొంటూ ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ‘ప్రజాసంక్షేమ సేవాసంఘం’ కార్యదర్శి పొదిలి అనిల్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ ను రాజధానిగా పొడిగించాలని కోరారు.

2034 జూన్‌ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ అమలుచేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని విన్నవించారు.

ఈ పిటిషన్‌ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని ఈ పిటిషన్‌ లో ప్రతివాదులుగా చేర్చారు.

కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషనర్‌ ఆరోపించారు. సహకారం, పరస్పర అవగాహన ఒప్పందం లేకపోవడం, చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన వ్యవహారం ఇంకా తేలలేదన్నారు. ఆస్తులు, అప్పుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్‌ తన పిటిషన్‌ లో ఆరోపించారు.

విభజన చట్టం అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. దీంతో వివాదాలు కోర్టులకు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల, అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. లేకపోతే చట్టబద్ధంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విభజన హామీలు అమలుకానందున హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్‌ కు ఉంటుందని స్పష్టం చేశారు.