Begin typing your search above and press return to search.

రూ.2 కోట్ల అప్పు తీర్చలేదని రూ.4 కోట్ల కారును కాల్చేశారు!

పోలీసులు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. నార్సింగ్ కు చెందిన వ్యాపారి నీరజ్ కు రూ.4కోట్లు విలువ చేసే స్పోర్ట్స్ కారు ఉంది

By:  Tupaki Desk   |   15 April 2024 7:30 AM GMT
రూ.2 కోట్ల అప్పు తీర్చలేదని రూ.4 కోట్ల కారును కాల్చేశారు!
X

హైదరాబాద్ మహానగరంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన దగ్గర తీసుకున్న రూ.2 కోట్ల అప్పును తీర్చలేదన్న కోపంతో రూ.4 కోట్ల విలువైన స్పోర్ట్స్ కారును దగ్థం చేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పలు సంచలన అంశాల్ని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఐటీ కారిడార్ లో కీలకంగా మారిన నార్సింగ్ కు చెందిన వ్యాపారి కారును ఈ రీతిలో కాల్చేయటం సంచలనంగా మారింది.

పోలీసులు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. నార్సింగ్ కు చెందిన వ్యాపారి నీరజ్ కు రూ.4కోట్లు విలువ చేసే స్పోర్ట్స్ కారు ఉంది. దానికి తాను అమ్మేయాలనుకుంటున్నట్లుగా మొఘల్ పురాకు చెందిన స్నేహితుడు అమన్ కు చెప్పాడు. ఈ క్రమంలో అహ్మద్ అనే వ్యక్తి సదరు కారును కొనేందుకు ఆసక్తిని చూపాడు. కారును చూసేందుకు దాన్ని తన ఫాంహౌస్ కు తీసుకురావాలని చెప్పారు.

దీంతో నీరజ్ మిత్రుడు అయాన్ కు ఈ కారును ఇచ్చి పంపారు. అయితే.. కారును ఫాంహౌస్ కు తీసుకెళ్లిన తర్వాత తమకు నీరజ్ రూ.2కోట్లు బాకీ ఉన్నాడని.. ఆ అప్పు తీర్చాలని చెప్పారు. లేదంటే.. రూ.4కోట్ల విలువైన కారును అక్కడే పెట్టేసి వెళ్లాలని ఆదేశించారు. దీంతో కంగుతిన్న అయాన్.. తనకు నీరజ్ అప్పు ఉన్న విషయం తెలీదని.. కారు కొంటామని చెప్పారు కాబట్టి.. చూపించేందుకు తెచ్చానని స్పష్టం చేశారు.

నీరజ్ ఆచూకీ గురించి ఆరా తీసిన అహ్మద్ కు.. తనకు తెలీదని అయాన్ చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అహ్మద్.. రూ.4కోట్ల విలువైన కారు మీద పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. దీంతో ఆ కారు కాస్తా మంటల్లో దగ్థమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అప్పు తీర్చలేని కారణంగా ఇలాంటి పని చేయటమా? అన్నది విస్మయంగా మారింది.