Begin typing your search above and press return to search.

15 ఎకరాలు.. 1,500 కోట్లు.. హైదరాబాద్ మెట్రో సంస్థ అమ్మేసింది.. తర్వాతేంటి?

బ్రేక్‌ ఈవెన్‌ వంటి కారణాల నేపథ్యంలో ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు 15 ఎకరాల భూమితో పాటే భవనాన్నీ అమ్మినట్లగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 7:25 AM GMT
15 ఎకరాలు.. 1,500 కోట్లు.. హైదరాబాద్ మెట్రో సంస్థ అమ్మేసింది.. తర్వాతేంటి?
X

హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ చూస్తున్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయంగా వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. ఎల్ అండ్ టీ (హైదరాబాద్) మెట్రో రైల్ సంస్థ తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో 15 ఎకరాలను విక్రయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు అవసరాలకు ఎల్ అండ్ టీ సంస్థకు కేటాయించింది. ఈ భూమి రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఉంది. వాస్తవానికి మెట్రో రైల్ ప్రతిపాదనలు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చాయి.

అంతలో సత్యం సంస్థ ఆర్థిక వివాదాల్లో ఇరుక్కోవడం.. వైఎస్ ఆకస్మిక మరణంతో స్తబ్ధత ఏర్పడింది. అనంతరం కాంట్రాక్టు ఎల్ అండ్ టీకి మారింది. 2010 తర్వాత పనులు మొదలై తెలంగాణ వచ్చాక 2017లో పూర్తయ్యాయి. కాగా, కాంట్రాక్టు సమయంలోనే భవిష్యత్ అవసరాల కోసం కొంత భూమిని ఎల్ అండ్ టీకి ఇచ్చారు. ఇప్పుడా భూమిలో రాయదుర్గం వద్ద ఉన్న 15 ఎకరాలను ఆ సంస్థ విక్రయించింది.

విలువెంతో..? కొన్నదెవరంటే..? ఎల్ అండ్ టీ రాయదుర్గం స్టేషన్ వద్ద ఉన్న 15 ఎకరాల భూమిని రాఫర్టీ డెవలప్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అమ్మింది. దీని విలువ రూ.1,500 కోట్లుగా పేర్కొంది. అంటే ఎకరా రూ.100 కోట్లు. మెట్రో రైల్ న్యాయ విభాగం అధిపతి, సంస్థ కార్యదర్శి చంద్రచూడ్ డి.పలివాల్ బుధవారం బొంబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. బుధవారమే జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా అందులో పేర్కొన్నారు.

"మాంద్యం కారణంగా అమ్మకం" రాఫర్టీ సంస్థకు విక్రయించడానికి గల కారణాన్ని ఎల్ అండ్ టీ ప్రతినిధులు "మాంద్యం కారణంగా అమ్మకం (స్లంప్ సేల్)గా పేర్కొన్నారు. అంటే సామాన్య భాషలో.. పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఆర్థిక ఒడిదొడుకుల కారణంగా అని భావించాలి. కాగా, ఈ నిర్ణయాన్ని ఎల్‌ అండ్‌ టీ గతేడాదే తీసుకుందని సమాచారం. ఒప్పందం సమయంలో రాయదుర్గం స్టేషన్ వద్ద ఇచ్చిన 15 ఎకరాల్లో 9 ఎకరాల్లో ఏకంగా రూ.200 కోట్లు వెచ్చించి ఎల్ అండ్ టీ భవనాన్ని నిర్మించడం గమనార్హం. కాగా, రైళ్ల నిర్వహణ, బ్రేక్‌ ఈవెన్‌ వంటి కారణాల నేపథ్యంలో ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు 15 ఎకరాల భూమితో పాటే భవనాన్నీ అమ్మినట్లగా తెలుస్తోంది.

కొన్నది వీరే.. రాయదుర్గం స్టేషన్ వద్ద ఎల్ అండ్ టీ నుంచి 15 ఎకరాలను బడా సంస్థలైన రహేజా, బ్రూక్‌ ఫీల్డ్‌ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.అయితే, కొన్ని రౌండ్ల చర్చల అనంతరం చివరకు రూ.1,500 కోట్ల విలువైన భూమి, భవనాన్ని రాఫర్టీ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, రాఫర్టీలో రహేజా, బ్రూక్‌ ఫీల్డ్‌ భాగస్వాములు.

నిబంధనలు మీరారా? కొవిడ్ సమయంలో అన్ని సంస్థలు, వ్యాపారాల్లాగే హైదరాబాద్ మెట్రో పైనా దెబ్బపడింది. అప్పటికి ఇంకా ఆరంభ దశలోనే ఉండడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఎల్ అండ్ టీ- ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వారికి కేటాయించిన స్థలాన్ని 33 ఏళ్ల వరకు అభివృద్ధి చేసుకునేందుకు మాత్రమే వీలుంది. అంతే తప్ప విక్రయించకూడదు. కానీ, ఈలోగానే ఎల్ అండ్ టీ అనూహ్యంగా రూ.1500 కోట్లకు అమ్మేసింది. ఇక్కడే గమనించాల్సినది ఏమంటే.. ఒప్పందంలో ఉన్న మేరకు 33 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భూమి మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకే వస్తుందా? లేక రాఫర్టీ సంస్థకు చెందుతుందా? అని.. ఈ విషయం ఇప్పటివరకు ఎటూ తేలలేదు.