Begin typing your search above and press return to search.

బ్రీత్ ఎనలైజర్ ఊదమంటే.. దాన్ని తీసుకొని పరార్

తాజాగా అలాంటి డ్రంకెన్ డ్రైవ్ వేళ.. ఒక మందుబాబు పోలీసులు తన నోటివద్ద పెట్టిన బ్రీత్ ఎనలైజర్ ను తీసుకొని జంప్ అయిన షాకింగ్ సీన్ చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   29 Jun 2024 4:26 AM GMT
బ్రీత్ ఎనలైజర్ ఊదమంటే.. దాన్ని తీసుకొని పరార్
X

హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన తాజా డంక్రెన్ డ్రైవ్ లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మందుబాబులు తాగిన మద్యం లెక్కను తేల్చే బ్రీత్ ఎనలైజర్ ను వారి నోటివద్ద పెట్టి.. గాలి ఊదమనటం.. అందులో వచ్చే స్కోర్ ఆధారంగా ఎంత తాగిందన్న విషయాన్ని గుర్తించటం తెలిసిందే. తాజాగా అలాంటి డ్రంకెన్ డ్రైవ్ వేళ.. ఒక మందుబాబు పోలీసులు తన నోటివద్ద పెట్టిన బ్రీత్ ఎనలైజర్ ను తీసుకొని జంప్ అయిన షాకింగ్ సీన్ చోటు చేసుకుంది.

దీంతో.. వాహనాల్ని తనిఖీలు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 27 అర్థరాత్రి దాటిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లాదాటిన తర్వాత వచ్చే ట్రాఫిక్ పాయింట్ చౌరస్తాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఆ టైంలో వర్షం పడుతోంది. దీంతో.. ముందుగా వచ్చిన ఒక కారు నడుపుతున్న డ్రైవర్ కు పరీక్షలు చేయగా.. అతడు మద్యం తాగలేదని తేలింది. వెనుకగా వచ్చిన కారును పోలీసులు ఆపారు.

కారును బ్యారికేడ్ల అవతలకు తీసుకెళ్లిన కానిస్టేబుల్ డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని టెస్టు చేసేందుకు బ్రీత్ ఎనలైజర్ ను అతడి ముఖం ముందు పెట్టాడు. అతను గాలి ఊదినట్లే నటించి.. కానిస్టేబుల్ చేతిలో ఉన్న బ్రీత్ ఎనలైజర్ ను లాక్కుని అక్కడి నుంచి ఊడాయించాడు. దీంతో అవాక్కుఅయిన పోలీసులు ఆ కారును వెంబడించినా ఫలితం లేకపోయింది.

అప్పటికే వర్షం కురుస్తుండటం.. అర్థరాత్రి దాటిన వేళలో రోడ్లు ఖాళీగా ఉండటంతో వేగంగా దూసుకెళ్లిన కారును పట్టుకోలేకపోయారు. అంతేకాదు.. సదరు కారు నెంబరును సైతం గుర్తించలేకపోయారు. ఈ వైనం షాకింగ్ గా మారటమే కాదు.. పోలీసు శాఖలో ఆసక్తికర చర్చకు తెర తీసింది.