శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. 14 కి.మీ., 13 స్టేషన్లు
తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సంంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
By: Tupaki Desk | 28 April 2024 3:30 PM GMTరేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే హైదరాబాద్ మహానగరికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టుల్ని ప్రకటించటం తెలిసిందే. అందులో ముఖ్యమైనది శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. మూసీ ప్రక్షాళన. మెట్రో విషయానికి వస్తే వడివడిగా పనులు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ వేళ.. పనులు మందకొడిగా నడుస్తున్నాయన్న దానికి భిన్నంగా పనులు వాయువేగంతో సాగుతున్నాయి. తాము నిర్దేశించుకున్న సమయానికే మెట్రో పనులు జరగటమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.
తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సంంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
రేవంత్ సర్కారు ప్రతిపాదించిన శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. నాగోల్ నుంచి శంషాబాద్ మధ్యన ఉండేలా డిజైన్ చేయటం తెలిసిందే. ఎల్ బీ నగర్ కు కాస్త ముందుగా నాగోల్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తారు. ఎయిర్ పోర్టు మెట్రో స్టేషన్లలో మొదటి స్టేషన్ నాగోల్ గా చెప్పాలి. మొత్తం 14 కిలోమీటర్ల దూరానికి 13 మెట్రో స్టేషన్లు రానున్నాయి. నాగోల్ చౌరస్తా.. అల్కాపురి చౌరస్తా.. కామినేని ఆసుపత్రి.. ఎల్బీనగర్ క్రాస్ రోడ్.. రింగ్ రోడ్డు.. మైత్రి నగర్.. కర్మన్ ఘాట్.. చంపాపేట క్రాస్ రోడ్.. ఓవైసీ ఆసుపత్రి.. డీఆర్ డీవో.. హఫీజ్ బాబానగర్.. చాంద్రాయణగుట్ట స్టేషన్లు వస్తాయని చెబుతున్నారు.
నాగోల్ - శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోకు సంబంధించి ఎలైన్ మెంట్.. మెట్రో స్టేషన్లను ఖరారు చేసేందుకు వీలుగా అధికారులు కాలినడకన పరిశీలన చేశారు. నాగోల్ లో ఇప్పుడున్న స్టేషన్ సమీపంలో న్యూ నాగోల్ ఎయిర్ పోర్టు స్టేషన్ ఎడమ వైపున రాబోతోంది. ఈ రెండు స్టేషన్లు కలిపేలా విశాలమైన స్కైవాక్ నిర్మించనున్నారు.
నాగోల్ లో మూసీ వంతెన వద్ద మంచినీటి పైపులైన్లు.. హెచ్ టీ విద్యుత్తు లైన్లు ఉన్న నేపథ్యంలో మెట్రో ఎలైన్ మెంట్ ను 10 మీటర్లు ఎడమ వైపు మార్చాలని.. మూసీ ప్రక్షాళన పనులకు ఇబ్బంది కలుగకుండా పొడవైన స్పాన్ లు ఉండేలా ప్లాన్ చేయనున్నారు. బైరామల్ గూడ- సాగర్ రోడ్ జంక్షన్లలో బహుళ ఫ్లైఓవర్లు ఉండటంతో మెట్రో లైన్ ఎత్తు అసాధారణంగా పెరుగుతోంది.
ఎత్తును తగ్గించటానికి ఎలైన్ మెంట్ ను కుడివైపునకు మార్చాల్సి వస్తోంది. అక్కడి ఫ్లైఓవర్ కారణంగా చంద్రాయణగుట్ట ఇంటర్ ఛేంజ్ స్టేషన్ నిర్మాణం క్లిష్టతరం కానుంది. స్టేషన్ కోసం భూసేకరణ తప్పని పరిస్థితి. ప్రైవేటు ఆస్తుల్ని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. మెట్రో స్టేషన్లకు సంబంధించి పేర్లను ఖరారు చేయటానికి ట్రాఫిక్ పోలీసులు.. సాధారణ ప్రజల నుంచి వచ్చే సలహాల్ని స్వీకరిస్తామని చెబుతున్నారు.