హైదరాబాద్ ఔటర్ ప్రైవేటుచేతికి వెళ్లిపోయింది.. 30 ఏళ్లు ఐఆర్ బీకే!
ముప్ఫై ఏళ్ల పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్ బీఐ అనే సంస్థకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
By: Tupaki Desk | 12 Aug 2023 4:47 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్ఫై ఏళ్ల పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ‘‘ఐఆర్ బీఐ’’ అనే సంస్థకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం.. దీనికి సంబంధించిన లాంఛన కార్యక్రమం శుక్రవారం అర్థరాత్రి జరిగింది. దీంతో.. ఈ రోజు (ఆగస్టు 12, 2023) నుంచి మరో ముప్ఫై ఏళ్ల పాటు ఈ సంస్థ చేతిలో ఉండనుంది. ఔటర్ రింగు రోడ్డు టోల్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లటంపై విపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. టెండర్ లో భాగంగా రూ.7380 కోట్ల మొత్తానికి ఐఆర్ బీఐ సంస్థ చేతికి అప్పజెప్పటం.. తన చేతుల్లోకి వచ్చిన క్షణం నుంచి టోల్ వసూలు ప్రక్రియను సదరు సంస్థ షురూ చేసింది.
శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకూ ఈగిల్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ పేరిట టోల్ రశీదు రాగా.. 12 గంటలు దాటిన తర్వాత ఐఆర్ బీ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రశీదును ఇవ్వటం షురూ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ టెండర్ ప్రక్రియ మీద పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది.అయినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. కొత్త సంస్థ చేతికి ఔటర్ ను అప్పగించే ప్రక్రియకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసి ఉన్నా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా నానక్ రామ్ గూడలో అర్థరాత్రి వేళ కొద్దిమంది హెచ్ఎండీఏ అధికారుల సమక్షంలో ఔటర్ అప్పగింత కార్యక్రమం పూర్తి కావటం గమనార్హం.
హైదరాబాద్ కు మణిహారంగా ఉన్న 158 కి.మీ. మేర నిర్మించిన ఐటర్ రింగ్ రోడ్డును ఇప్పటివరకుప్రభుత్వ అధీనంలోని హెచ్ఎండీఏ - హెచ్ సీఎల్ సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఔటర్ పై ప్రస్తుతం రోజువారీగా రూ.1.55 కోట్ల నుంచి రూ.1.65 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.45 కోట్ల మేర వస్తున్న ఆదాయం ఏడాదికి రూ.540 కోట్ల మేర వస్తోంది. ఈ నేపథ్యంలో టీవోటీ పద్దతిలో 30 ఏళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించి.. టెండర్లు పిలవటం.. ఐఆర్ బీఐ సంస్థకు రూ.7380 కోట్లకు ఇవ్వటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 30 ఏళ్లకు సంబంధించిన రూ.7380 కోట్ల భారీ మొత్తాన్ని గురువారం సదరు సంస్థ చెల్లించటం.. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆ సంస్థకు వసూళ్ల బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విడిరోజులతో పోలిస్తే సెలవులు.. పండుగల సమయంలో ఔటర్ మీద ఆదాయం మరింత పెరుగుతుంది. బంగారు బాతుగుడ్డు లాంటి ఔటర్ ను ప్రైవేటుకు అప్పగించటాన్ని పలువురు తప్పు పట్టారు. ఒక అంచనా ప్రకారం పదేళ్ల వ్యవధిలోనే రూ.7వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ ను ముప్ఫై ఏళ్లకు రూ.7380 కోట్లకు ఇవ్వటంపై అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
తాను అనుకున్నట్లే టెండర్ లో అత్యధిక ధరను కోట్ చేసిన సంస్థకు ఇచ్చేసింది. ఓపక్క టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని పూర్తిగా వెల్లడించకపోవటం.. బేస్ ధర మీద గోప్యత పాటించటాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ తీవ్రంగా తప్పు పట్టారు. తనకు అవసరమైన సమాచారాన్ని సమాచార హక్కుచట్టం కింద కోరినా ఇవ్వలేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు వివరాలు అందజేయాలని కోర్టు కూడా ఆదేశించింది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు శుక్రవారం అర్థరాత్రి వేళ గోప్యంగా ఐఆర్ బీఐ సంస్థకు ఔటర్ ను అప్పగించేయటం సంచలనంగా మారింది.