Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో డేటింగ్ పేరుతో చీటింగ్

హైదరాబాద్ లో డేటింగ్ యాప్ ల ముసుగులో ఓ కిలేడీ పన్నిన ట్రాప్ లో పడి పదుల సంఖ్యలో యువకులు మోసపోతున్న వైనం సంచలనం రేపుతోంది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:30 PM GMT
హైదరాబాద్ లో డేటింగ్ పేరుతో చీటింగ్
X

మీరు టిండర్ వంటి డేటింగ్ యాప్ లు వాడుతున్నారా? మీకు నచ్చిన అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ తో చాట్ చేసి వారిని నేరుగా కలిసే ప్రయత్నం చేస్తున్నారా? ఆ అమ్మాయి మాటలకు పడిపోయి క్లబ్ లో కలుద్దాం అని అడగ్గానే...ఆత్రంగా అక్కడ వాలిపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త....మీరు కలిసే అమ్మాయి విసిరే వలపు వలలో పడి మీరు విలవిలలాడే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లో డేటింగ్ యాప్ ల ముసుగులో ఓ కిలేడీ పన్నిన ట్రాప్ లో పడి పదుల సంఖ్యలో యువకులు మోసపోతున్న వైనం సంచలనం రేపుతోంది.

ఈ రోజుల్లో చాలామంది డేటింగ్ యాప్ వాడుతున్నారు. తమకు నచ్చిన వారితో డేటింగ్ కు వెళుతున్నారు. అయితే, ఈ డేటింగ్ ను అడ్డుపెట్టుకొని యువకులను చీటింగ్ చేస్తోందో యువతి. టిండర్, బంబుల్ వంటి యాప్స్ లో యువకులతో పరిచయం పెంచుకొని వారికి వల పన్నుతోంది. ముందు చాటింగ్..ఆ తర్వాత చీటింగ్ చేస్తోన్న ఆ యువతి గుట్టురట్టుకావడంతో సదరు యువకులు లబోదిబోమంటున్నారు.

యువకులతో పరిచయం అయిన తర్వాత చాటింగ్ చేసి..ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుకొని ఓ క్లబ్ లో కలుద్దామని ఆ యువతి ఆహ్వానిస్తుంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు...ఆత్రంగా సదరు యువకుడు ఆ క్లబ్ కు వెళతారు. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న అమ్మాయి...వెయిటర్ ను పిలిచి ఆ క్లబ్ లోనే అత్యంత ఖరీదైన డ్రింక్ ను ఆర్డర్ చేస్తుంది. ఆ యువకుడిని అడగకుండానే, మెనూ చూడకుండా రూ.20 వేల నుంచి రూ.40వేల ఖరీదైన డ్రింక్ ఆర్డర్ చేయడంతో సదరు యువకులు అవాక్కవుతారు. కానీ, అమ్మాయి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి గమ్మునుంటారు. ఇక, తీరా డ్రింక్ తాగిన తర్వాత బిల్లు యువకుడి నెత్తిన వేయడం ఆ యువతి స్పెషాలిటీ. పరువు పోతుంది కాబట్టి ఆ బిల్ యువకుడే కడతాడు. అలా వారి ఫస్ట్ మీట్ పూర్తవుతుంది.

ఇలా ఒకరో ఇద్దరో కాదు... అదే క్లబ్ లో అదే కిలేడీ బారిన పడి పదుల సంఖ్యలో యువకులు మోసపోయారు. ఆ యువకులందరినీ ఇదే పద్ధతిలో మోసం చేయడం ఆ యువతి టెక్నిక్. ఈ వ్యవహారం పసిగట్టిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతి బండారం బయటపడింది. అయితే, ఆ ఖరీదైన డ్రింక్ తాగడం వల్ల యువతికి ఏ రకంగా డబ్బులు వస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బహుశా తక్కువ ఖరీదైన డ్రింక్ ను ఎక్కువ ఖరీదైనదిగా బిల్ వేయించి ఆ డబ్బును యువతి కొట్టేస్తోందని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా, ఇటువంటి నకిలీ మహిళలు, డేటింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.