హైదరాబాద్ లో ఐదు సొరంగ రహదారులు... రూట్స్ ఇవే!
అవును... హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Feb 2024 10:23 AM GMTహైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయంత్రం 6 గంటలకు ఆఫీసునుంచి వచ్చే ఎవరిని కదిపినా.. ఉదయం 9 గంటల సమయంలో ఆఫీసుకు బయలుదేరే వారిని అడిగినా.. కథలు కథలుగా ట్రాఫిక్ కష్టాలు చెబుతారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే... సినిమాలేసి మరీ ట్రాఫిక్ కష్టాలను చూపిస్తారు. ఈ సమయంలో... హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు కాస్త గట్టెక్కించేందుకు సొరంగ రహదారులు నిర్మించేందుకు దృష్టి సారించిందని తెలుస్తుంది. ఈ సమయంలో ఒక కీలక స్టెప్ కూడా పడిందని అంటున్నారు.
అవును... హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పరిష్కారం తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీ.హెచ్.ఎం.సీ, ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పరిశీలించారు.
ఇందులో భాగంగా... జీ.హెచ్.ఎం.సీ అధికారులు సొరంగ రహదారుల నిర్మాణంపై దృష్టిసారించి ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్తగా 5 టన్నెళ్లు నిర్మించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెడీ అయిందని.. త్వరలో సాధ్యాసాధ్యాలపై డీపీఆర్ ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రతిపాదించిన ఐదు మార్గాలు ఇవే..!
ఐటీసీ కోహినూర్ - విప్రో సర్కిల్ వయా ఖాజాగూడ టు నానక్ రాంగూడ.
ఐటీసీ కోహినూర్ – కూకట్ పల్లి జే.ఎన్.టీ.యూ వయా మైండ్ స్పేస్.
ఐటీసీ కోహినూర్ - బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వయా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45.
జీవీకే వన్ మాల్ - నానల్ నగర్ వయా మాసబ్ ట్యాంక్.
నాంపల్లి - చంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వయా చార్మినార్, ఫలక్ నుమా.
తాజాగా ఈ ఐదు టన్నెళ్ల నిర్మాణం గురించి స్పందిస్తున్న జీ.హెచ్.ఎం.సీ అధికారులు... ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇది ప్రస్తుతానికి సరైన నిర్ణయం అని అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ కారిడార్లలో రహదారి సొరంగాల అభివృద్ధి ద్వారా ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ అంతటా కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని అంటున్నారు!