Begin typing your search above and press return to search.

హైదరాబాదోళ్లు వందేభారత్‌ ఎక్కాలంటే.. ఆఫీస్ డుమ్మా కొట్టాల్సిందే..?

వాస్తవానికి ప్రధానంగా వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు వివరించారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 6:36 AM GMT
హైదరాబాదోళ్లు వందేభారత్‌  ఎక్కాలంటే.. ఆఫీస్  డుమ్మా కొట్టాల్సిందే..?
X

హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలును సెప్టెంబర్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాచిగూడ - యశ్వంత్‌ పూర్ మధ్య నడిచే ఈ రైలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారంలో ఆరు రోజులు నడుస్తుంది. బుధవారం ఈ రైలుకి రెస్ట్ అన్నమాట! ఆ సంగతి అలా ఉంటే... ఈ రైల్ టైమింగ్స్ పై ఐటీ ఉద్యోగులు ఫైరయిపోతున్నారు.

అవును... హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలు టైమింగ్స్ విషయంలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రధానంగా వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు వివరించారు. అయితే ఇప్పుడు వారే ఈ ట్రైన్ టైమింగ్స్ పై ఫిర్యాదు చేస్తున్నారు. అందుకు గల కారణాలు కూడా సహేతుకంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వందేభారత్ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైదరాబాద్, బెంగళూరులోని రెండు ఐటి హబ్‌ ల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఈ రైలును ప్రవేశపెట్టారు. ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆచరణకు వచ్చే సరికి ప్రాక్టికల్ ప్రాబ్లంస్ వస్తున్నాయని ఐటీ నిపుణులు ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగా... ఐటి, ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన కాచిగూడ – యశ్వంత్‌ పూర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు నిరుపయోగంగా మారిందని అంటున్నారు. రైలు టైం షెడ్యూల్, చాలా మంది ఐటి ఉద్యోగుల టైమింగ్స్‌ కు చాలా వ్యత్యాసం ఉంటోందని.. ఫలితంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కి ఈ రైలు ప్రయాణం ఆశించిన మేరకు సంతృప్తికరంగా లేదని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... కాచిగూడ- యశ్వంత్‌ పూర్ మధ్య దూరం దాదాపు 610 కిమీ! ఈ దూరం ప్రయాణానికి వందే భారత్ రైలులో 8:30 గంటలు పడుతుంది. ఏదైన అంతరాయం ఏర్పడితే.. 10 గంటలు కూడా పడుతుంది. ఈ సమయంలో ఐటీ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైలు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, దాని టైమింగ్స్ విషయంలో మాత్రం పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు!

ప్రస్తుతం, వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ కాచిగూడ నుండి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి యశ్వంతపూర్ జంక్షన్‌ కు మధ్యాహ్నం 2.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి ప్రజలు వారి ఆఫీసు లేదా ఇంటికి చేరుకునే సమయం దాదాపు మరో రెండు గంటలు పట్టే అవకాశం ఉండటంతో... రోజంతా ప్రయాణానికే సరిపోయినట్లవుతుంది.

ఇక, తిరుగు ప్రయాణ సమయం విషయానికొస్తే... యశ్వంత్‌ పూర్‌ జంక్షన్‌ నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరూతుంది. అంటే బెంగళూరు ట్రాఫిక్‌ ను అధిగమించి.. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరితే ఆ 2:45కి ట్రైన్ ని చేరుకోవచ్చు. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అన్నీ అనుకూలంగా జరిగితే రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అక్కడనుంచి ఇళ్లకు చేరుకునేసరికి అర్ధరాత్రి!

అలా కాకుండా... వందేభారత్‌ రైలు టైమింగ్స్‌ మార్చాలని రైల్వే అధికారులను అభ్యర్థిస్తున్నారు ఉద్యోగులు. వారి రిక్వస్ట్ ప్రకారం రైలు యశ్వంత్‌ పూర్‌ కి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకుంటే బాగుంటుందని.. అప్పుడు, కనీసం సగం రోజు పని చేయడానికి కొంత అవకాశం ఉంటుందని కోరుతున్నారట. మరి వారి అభ్యర్థనను రైల్వే డిపార్ట్ మెంట్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందనేది వేచి చూడాలి.