Begin typing your search above and press return to search.

అమెరికాలో కాల్పుల కలకలం.. తెలంగాణ యువకుడి దుర్మరణం!

హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్ మాస్టర్స్ విద్యనభ్యసిస్తూ అక్కడే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   5 March 2025 10:56 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలంగాణ యువకుడి దుర్మరణం!
X

అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్ మాస్టర్స్ విద్యనభ్యసిస్తూ అక్కడే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

- ప్రవీణ్ పై కాల్పులు

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన రాఘవులు, రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్, మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. చదువుకు సంబంధించిన ఖర్చులను తట్టుకునేందుకు స్థానికంగా ఉన్న స్టార్ హోటల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ బసచేసిన ప్రాంతానికి సమీపంలోని బీచ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్లు సమాచారం.

- శోకసంద్రంలో కుటుంబం

ఈ ఘటన గురించి ప్రవీణ్ స్నేహితులు ఆయన కుటుంబానికి సమాచారం అందించగా, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా అమెరికాలో భారతీయ విద్యార్థులు ఇలాంటి కాల్పుల్లో మృతిచెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇదే తరహా ఘటనలు పునరావృతం అవుతుండటంతో భారతీయ విద్యార్థుల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారు.