బోసిపోయిన భాగ్యనగరం... ఈసారి మరింత దారుణం!?
అవును... దసరా పండుగ వేళ భాగ్యనగరం నిర్మానుష్యంగా మారిపోయింది.
By: Tupaki Desk | 11 Oct 2024 9:32 AM GMTప్రస్తుతం భాగ్యనగరం నిర్మానుష్యంగా మారింది.. భాగ్యనగరం మొత్తం బోసిపోయినట్లు కనిపిస్తుంది. కారణం దాదాపుగా అందరికీ తెలిసిందే! దసరా పండుగ వేళ భాగ్యనగర వాసులంతా తమ తమ సొంత ఊర్లకు ప్రయణమై వెళ్లారు. దీంతో.. భాగ్యనగర రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
అవును... దసరా పండుగ వేళ భాగ్యనగరం నిర్మానుష్యంగా మారిపోయింది. నగరంలోని రహదారులన్నీ బోసిపోగా.. ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగానే తిరుగుతున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతో నగర జీవులంతా పల్లెబాట పట్టారు.. వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు.
సాధారణంగా సంక్రాతి సెలవుల సమయంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.. దసరాలోనూ ఉన్నప్పటికీ ఓ మోస్తరుగా ఉంటుంది.. కానీ... ఈసారి సంక్రాంతిని తలపించేలా దసరా పండుగ వేళ పరిస్థితి కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... పల్లెకు పండగ కళ వేళ భాగ్యనగరం బోసి పోవడం ప్రతీ ఏటా కామన్ అనే చెప్పాలి.
ఇక నవరాత్రుల్లో భాగంగా ప్రధానా పండుగలైన దుర్ఘాష్టమి, నవమి, దశమిలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో... బుధవారం నుంచే హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని తమ తమ స్వస్థలాలకు ప్రజలంతా కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లారు. ఈ నాలుగు రోజులూ కుటుంబ సభ్యులతో, ఊరి వాతావరణంలో హాయిగా పండుగను ఎంజాయ్ చేసి తిరిగి రానున్నారు.
ఇక హైదరాబాద్ నగరం నుంచి ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో... దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో... విజయవాడ, వరంగల్ నేషనల్ హైవేపై టొల్ ప్లాజా వద్ద బస్సులు, కార్లు భారీగా బారులు తీరాయి.
మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకూ సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు ఈ నెల 14వ తేదీతో ముగియనున్నాయి. దీంతో... నగరాన్ని విడిచి తమ తమ సొంతూళ్లకు వెళ్లిన వారంతా సోమవారం తర్వాత తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం కానున్నారని అంటున్నారు. అప్పుడు మళ్లీ భాగ్యనగర రహదారులు కిక్కిరిసిపోనున్నాయి!