హైడ్రా దూకుడు.. ఐదంస్తుల అపార్ట్‌మెంట్ నేలమట్టం
అలా.. 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
By: Tupaki Desk | 5 Jan 2025 8:55 AM GMTహైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కాపాడడమే లక్ష్యంగా తీసుకొచ్చిన హైడ్రా.. మళ్లీ దూకుడు మొదలుపెట్టింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక వెంటనే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే హైడ్రా వందలాది కట్టడాలను నేలమట్టం చేసింది. అలా.. 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. తాజాగా.. తన పనిని మరోసారి ప్రారంభించింది.
ఇప్పటివరకు ఆక్రమణకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను హైడ్రా కాపాడింది. అలాగే.. ఆయా చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చింది. ఆ స్థలాలను విముక్తి కల్పించింది. అలాగే.. రాయదుర్గం పరిధిలని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన ఇళ్లను, దుకాణాలను సైతం తొలగించింది.
తాజాగా.. శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో 684 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్‌మెంటును నిర్మించారు. ప్రస్తుతం ఇంకా ఇది నిర్మాణ దశలోనే ఉంది. దాదాపు చివరి దశలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ అక్రమంగా నిర్మిస్తున్నారంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైకోర్టు, జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసినా అక్రమ నిర్మాణం కొనసాగుతున్నాయంటూ స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు అయ్యప్ప సొసైటీని సందర్శించారు. 100 ఫీట్ రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ నిర్మాణం అక్రమమని తేల్చారు. హైకోర్టు ఆదేశాలు, జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులను సైతం బిల్డర్ బేఖాతర్ చేశాడని తేలింది. సెల్లార్‌తోపాటు జీ ప్లస్ 5 అంతస్తులు కలిగిన ఈ భవనం అక్రమ నిర్మాణం అంటూ 2024 ఫిబ్రవరిలోనే నిర్ధారించారు. అయినా బిల్డర్ పట్టించుకోకుండా నిర్మిస్తూనే ఉన్నాడు. దానిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశించింది. జూన్‌లో జీహెచ్ఎంసీ మరోసారి నోటీసులు పంపింది. అయినా బిల్డర్ పట్టించుకోలేదు. దీంతో హైడ్రా రంగ ప్రవేశం చేసింది. స్వయంగా రంగనాథ్ వచ్చి చూశారు. అక్రమ నిర్మాణమే అని నిర్ధారించుకున్న తరువాత ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు.